మంగళగిరి నుంచి పోటీ చేయడం పూర్వజన్మ సుకృతం
మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి కొత్త వైభవం తెస్తామని, ఇక్కడి నుంచి పోటీ చేయడం పూర్వజన్మ సుకృతమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. తనకు కులం, మతం లేదని, తాను ఆంధ్రుణ్ణి అని గర్వంగా చెప్పుకుంటానని అన్నారు. రాజధాని ప్రాంతంలోని మంగళగిరికి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో మంగళగిరిలోని టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గంజి చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. చిరంజీవికి మంచి రాజకీయ భవిష్యత్తు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందన్నారు. గడిచిన నాలుగేళ్లలో మంగళగిరి ప్రాంతానికి ఐటీ సంస్థలను పెద్దఎత్తున తీసుకువచ్చామని, ఈ ప్రయత్నంలో ఇక్కడి ఇన్‌ఛార్జి చిరంజీవి పూర్తి సహకారం అందించారని చెప్పారు.
1985 తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి విజయం సాధించలేదని, 2014లో గంజి చిరంజీవి కేవలం 12 ఓట్లతో ఓడిపోయారని గుర్తు చేశారు. మూడేళ్లుగా ఇక్కడి ప్రజలతో మమేకమయ్యాను. రానున్న ఐదేళ్లలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడానికి ప్రణాళికాబద్దంగా పనిచేస్తాం. ప్రజలంతా తమ వైపుండి మద్దతు ఇస్తుంటే జగన్‌మోహనరెడ్డి, కేసీఆర్, మోదీ ఏమీ చేయలేరు అని ఆయన సృష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి బలమైన పునాది వెనుకబడిన వర్గాలేనని పేర్కొన్నారు. ఇక్కడి చేనేతలు తనను ఆదరించి గెలిపించాలని కోరారు. స్థానికుల సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చానని, అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.