ఆ ఘనత సీఎం చంద్రబాబుదే : లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1.35 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి 2.5 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ యువనేత, మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళశాలలో జరుగుతున్న మహానాడులో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేగంతో యువకుడినైన తానే పోటీ పడలేకపోతున్నానని అన్నారు. యువజన, క్రీడ, ఐటి విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. విశాఖను ఐటీ హబ్‌గా తీరిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతపురం జిల్లాకు కియా కార్ల సంస్థ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ఒక గంట ఆలస్యమైనా చంద్రబాబు ఓపికతో వేచి చూసి హెచ్‌సీఎల్‌తో ఎంవోయూ చేసుకున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం రూ.42.92 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తల పిల్లల కోసం రూ.10 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. దేశంలో ఏ పార్టీ అయినా కార్యకర్తల సంక్షేమానికి ఇన్ని నిధులు ఖర్చుపెట్టిందా అని ప్రశ్నించారు. అలాగే ప్రమాదవశాత్తు కార్యకర్తలు చనిపోతే వాళ్ల కుటుంబానికి రూ.2 లక్షలు ఇచ్చి ఆదుకోవడం జరిగిందని పేర్కొన్నారు. 2014లో రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌తో రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకొక్క సమస్యను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకు వెళుతున్నారని అన్నారు. అంధకారంలో ఉన్న రాష్ట్రానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నారని అన్నారు.