ఉగ్రవాదంపై ఇక యుద్ధమే...మోదీ
హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ మోదీలో ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై పోరుకు కదలాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న, ఆర్థిక మద్దతిస్తున్న దేశాలపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటించారు. ఆ యుద్ధానికి డొనాల్డ్ ట్రంప్ కచ్చితంగా మద్దతిస్తారని, ఆయనే ముందుండి నడుపుతారని తెలిపారు. ఉగ్రవాదంపై అలుపెరగని పోరాటం చేస్తున్న ట్రంప్‌ను నిలుచుని చప్పట్లు కొడుతూ ప్రశంసించాలని ఆహూతులను కోరారు.
అమెరికాలో జరిగిన 9/11 దాడుల వెనుక, భారత్‌లో జరిగిన 26/11(ముంబై దాడులు) నరమేథం వెనుక కుట్రదారులెవరో ప్రపంచం మొత్తానికి తెలుసు అని వ్యాఖ్యానించారు. దాదాపు అరగంట పాటు సాగిన ప్రసంగంలో ఇప్పటివరకు ఐదేళ్ల తమ పాలన సాధించిన విజయాలను మోదీ ఏకరువు పెట్టారు. 60 ఏళ్లలో సాధించలేని వాటిని ఐదేళ్లలో సాధించగలిగామన్నారు. భారత్, అమెరికా అభివద్ధిలో ప్రవాస భారతీయుల కషి ఎంతో ఉందన్న మోదీ.. వారి కోసం భారత్ ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. భారత్, అమెరికాల దోస్తీ 21వ శతాబ్దంలో మరిన్ని ఆవిష్కరణలతో అభివద్ధి పథంలో సాగాల్సి ఉందన్నారు. కార్యక్రమం ప్రారంభంలో మొదట మోదీ ప్రసంగించి, ట్రంప్‌ను భారత్‌కు నిజమైన స్నేహితుడంటూ ఆహూతులకు పరిచయం చేశారు. అనంతరం ట్రంప్ ప్రసంగించారు. అమెరికా అభివ ద్ధిలో భారతీయ అమెరికన్ల పాత్ర ఎంతో ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలోని దాదాపు 4 మిలియన్ల భారతీయులపై తనకెంతో గౌరవం ఉందన్నారు. 'వి.. ద పీపుల్' అనే వాక్యంతోనే భారత్, అమెరికాల రాజ్యాంగ పీఠిక ప్రారంభమవుతుందని, ఇదే ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యాలకు రుజువని పేర్కొన్నారు. ట్రంప్ ప్రసంగ సమయంలో 'యూఎస్‌ఏ.. యూఎస్‌ఏ' అంటూ ప్రేక్షకులు నినదించడం విశేషం. ట్రంప్ ప్రసంగం అనంతరం మోదీ మరోసారి కీలక ప్రసంగం చేశారు. మోదీ తన మొదటి ప్రసంగాన్ని ఇంగ్లీష్‌లో, తదుపరి ప్రసంగాన్ని హిందీలో చేయడం విశేషం.