భారత్-అమెరికా బంధం మరింత పటిష్టం
మోదీ అమెరికా పర్యటన విజయవంతం
ఐక్యరాజ్యసమితి వేదికపై.... భారత్‌లో ప్రవేశపెట్టిన సంస్కరణలు ప్రపంచాన్నే మారుస్తున్నాయని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సమాన అభివృద్ధి అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ మా నినాదమని చెప్పారు. వ్యక్తి ప్రయోజనం కంటే సమాజ ప్రయోజనమే ముఖ్యమని, దేశంలో 36 కోట్ల మందికి బీమా సౌకర్యం కల్పించామన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు పాముకు పాలు పోస్తున్నామని అర్ధం చేసుకోవాలని, ఉగ్రవాదాన్ని రాజకీయ పనిముట్టుగా వాడే దేశాలు చివరకు అది తమను కూడా కబళిస్తుందని గ్రహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్‌కు హితబోధ చేశారు. ఐరాస 76వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామంగా మారుతోందని ఇది మంచిదికాదని కూడా హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్, కరోనా, ఇండోపసిఫిక్, అంతర్జాతీయ సవాళ్లు.. వంటి అనేక అంశాలను ప్రధాని తన సందేశంలో ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచం తిరోగామి ఆలోచనా విధానాలు, అతివాద విధానాలతో సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచమంతా శాస్త్రీయాధారిత ధ ృక్పధాన్ని, పురోగామి మార్గాన్ని అవలంబించి అభివృద్ధి దిశగా పయనించాలని సూచించారు. శాస్త్రీయ ధోరణులను పెంపొందించేందుకు భారత్ అనుభవాధారిత విద్యను ప్రోత్సహిస్తోందని చెప్పారు. కాని ఇదే సమయంలో కొన్ని దేశాలు తీవ్రవాదాన్ని స్వీయప్రయోజనాలకు అనుకూలంగా వాడుకోవాలని తిరోగామి ఆలోచనలు చేస్తున్నాయని పరోక్షంగా పాక్‌పై మండిపడ్డారు. వివిధ అంతర్జాతీయ సంస్థలు చైనా విషయంలో మాటమార్చడాన్ని కూడా ప్రస్తావించారు. ఐరాస విశ్వనీయత పెంచుకోవాలని చురకలంటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా చర్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ సముద్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు. అఫ్గానిస్తాన్‌ను ఎవరూ సొంత ప్రయోజనాలకు వాడుకోకూడదని హితవు చెప్పారు.
వివిధ అంశాలపై ప్రధాని చెప్పిన మాటలు
ప్రజాస్వామ్యానికి భారత్ వేదికగా ఉంది అని చెప్పడానికి తన జీవితమే నిదర్శనమని అంటూ, ఒక టీ అమ్ముకునే వ్యక్తి స్థాయి నుంచి ఐరాసలో భారత ప్రధానిగా ప్రసంగించేవరకు సాగిన తన జీవిత ప్రస్థానాన్ని తెలియజేశారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లివంటిది. ఈ ఏడాది ఆగస్టు 15న ఇండియా 75వ స్వాతంత్య్రోత్సవాలు జరుపుకుంది. భారత్‌లో భిన్నత్వమే బలమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం. భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతమైందనేందుకు నేనే నిదర్శనం అని పేర్కొన్నారు.
* ఐక్యరాజ్యసమితిపై మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి తన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచు కోవాలి. వివిధ దేశాలకు ఆలంబనగా ఉండాలను కుంటే ఐరాస విశ్వసనీయతను పెంచాలి. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకుంటే విఫలమైనట్లేనన్న చాణక్య సూక్తిని గుర్తు చేసుకోవాలి. కరోనా, వాతావరణ మార్పు తదితర అంశాల్లో ఐరాస ప్రవర్తన గురించి అనేక ప్రశ్నలు తలెత్తాయి. అఫ్గాన్ ఉదంతం ఐరాస తీరుపై ప్రశ్నల్లో వాడిని పెంచాయి. కరోనా పుట్టుక, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాకింగులు, అంతర్జాతీయ సంస్థల పనితీరు వంటివి అనేక సంవత్సరాల ఐరాస కృషిని, ఐరాసపై నమ్మకాన్ని దెబ్బతీశాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు ఐరాసను అందరం బలోపేతం చేయాలి. అప్పుడే అంతర్జాతీయ చట్టాలు, విలువలకు రక్షణ లభిస్తుందని చెప్పారు.
* కరోనా టీకాపై మాట్లాడుతూ ప్రపంచంలో తొలి డీఎన్‌ఏ కరోనా వ్యాక్సిన్ ‘జైకొవ్-డీ’ని భారత్ అభివృద్ధి చేసిందని, దీన్ని 12 ఏండ్లు నిండిన వారందరికీ ఇవ్వవచ్చని తెలిపారు. ‘రండి.. భారత్‌లో వ్యాక్సిన్లు తయారుచేయండి’ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్ తయారీదారులను ఆహ్వానించారు. సేవే ఉత్తమ ధర్మం అని విశ్వసించే భారత్ వ్యాక్సిన్ల అభివృద్ధికి, తయారీకి శక్తివంచన లేకుండా కృషి చేసిందని చెప్పారు. కరోనా మహ్మమారిపై పోరు ప్రపంచ ప్రజలకు ఐకమత్యం విలువను తెలియజేసింది. సేవే పరమ ధర్మం అనే సూత్రంపై ఆధారపడే భారత్ కరోనా టీకా రూపకల్పనలో తొలినుంచి కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వనరులు పరిమితంగా ఉన్నా సరే సమర్ధవంతంగా వాడుకొని ప్రపంచానికి తొలి డీఎన్‌ఏ ఆధారిత కరోనా టీకాను అందించింది. కరోనా నాసల్ టీకా అభివృద్ధిలో భారతీయ సైంటిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మానవత్వాన్ని మర్చిపోని భారత్ మరోమారు టీకాల ఎగుమతిని ఆరంభించింది. ప్రపంచంలో టీకాలు తయారుచేసే ఏ సంస్థయినా భారత్‌లో ఉత్పత్తి ఆరంభించవచ్చని పిలుపునిచ్చారు.
* భారత్‌లో సంస్కరణలు ప్రపంచాభివృద్ధికి దోహదం చేస్తుందని చెబుతూ, భారత్ వృద్ధి బాటలో పయనిస్తే ప్రపంచం కూడా అదే బాటలో పయనిస్తుంది. అభివృద్ధి ఎప్పుడూ సమ్మిళితంగా అందరికీ అందేదిగా ఉండాలన్నారు.
* పర్యావరణంపై మాట్లాడుతూ, అంతర్జాతీయ వాణిజ్యానికి సముద్రాలే కీలకం. వీటిని కాపాడాలుకోవడం కోసం అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకి రావాలి. నిబంధనల పాటింపు, వివాదాల శాంతియుత పరిష్కారం, ప్రజాస్వామిక విలువలు, రాజ్యాల సార్వకచిమత్వం కోసం అంతా పాటుపడాలి. వాతావరణ మార్పు ప్రభావం భూగోళంపై తీవ్రంగా పడుతోంది. ప్రకృతికి అనుగుణ జీవనం సాగించడమే దీని నివారణకు మార్గం. పారిస్ ఒప్పందానికి అనుగుణంగా భారత్ మాత్రమే తగిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
* అఫ్గాన్‌లో నేడు ఉన్న పరిస్థితులను ప్రస్తావిస్తూ, ఈ పరిస్థితులను ఏ దేశం కూడా తమకు అనుకూలంగా మలుచుకోకుండా చూడాలన్నారు. ఎవరూ అఫ్గాన్‌ను స్వీయ అవసరాలకు వాడుకోకుండా నిలువరించాలి. కల్లోల అఫ్గాన్‌కు అంతా సాయం అందించాలి. ఆదేశంలో మైనార్టీలకు రక్షణ లభించేందుకు కృషి చేయాలి. ‘‘మంచి పని చేసేందుకు ధైర్యంగా ముందుకు సాగితే మార్గంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ అధిగమించవచ్చు’’ అనే రవీంద్రనాధ్ టాగూర్ వ్యాఖ్యతో ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.
భారత్, అమెరికా దేశాల బంధం మరింత బలోపేతం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో భారత్, అమెరికా దేశాల బంధం మరింత బలోపేతం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇరుదేశాల మధ్య వ్యాపార భాగస్వామ్యం మరింత పటిష్టమవ్వాలని, ఇరుదేశాల వాణిజ్య బంధానికి ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా మోదీ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. కొవిడ్-19పై పోరాటం సహా విస్త ృత ప్రాధాన్యతా అంశాలపై శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్ లో సుమారు గంటపాటు చర్చించారు. పర్యావరణ పరిరక్షణ, ఉగ్రవాద ముప్పు నివారణ, అఫ్గానిస్థాన్ పరిణామాలు, ఇండో`పిసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం సహా ఆర్థిక, రక్షణ సంబంధ వ్యవహారాల్లో పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలని, స్నేహాన్ని మరిన్ని కొత్త రంగాలకు విస్తరించుకోవాలని ఈ చర్చల్లో నిర్ణయించారు. బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇద్దరు నేతలు ముఖాముఖీ కలుసుకోవడం ఇదే ప్రథమం. ఇప్పటి వరకు ఫోన్ ద్వారా సంభాషించుకున్నారు. వర్చువల్ సమావేశాల ద్వారా మాత్రమే కలుసుకున్నారు. 2014, 2016లలో వీరు కలుసుకున్నప్పటికీ అప్పుడు బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
శ్వేతసౌధంలో మోదీకి స్వాగతం పలుకుతూ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశాలు అత్యుంత దృఢంగా సన్నిహితంగా ఉండడం నిర్ణయాత్మకమని బైడెన్ అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని ప్రస్తావిస్తూ బాపూజీ అహింస, సహనం, శాంతి సందేశాలు ప్రపంచానికి గతంలో కన్నానేడెంతో అవసరమని పేర్కొన్నారు. ప్రపంచ సవాళ్లకు భారత్-అమెరికా బంధం పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. సాదర స్వాగతానికి మోదీ కృతజ్ఞతలు చెబుతూ 2014, 2016లలోనూ మీతో మాట్లాడే అవకాశం లభించింది. భారత్, అమెరికా సంబంధాలపై మీ దార్శకతను అప్పుడు వెల్లడిరచారు. దీనిని సాకారం చేసేందుకు మీ నేతృత్వంలోని కృషిని కొనసాగించడం హర్షణీయమని అన్నారు. వాణిజ్యం, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారం రెండు దేశాల స్నేహ సంబంధాల్లో కీలక భూమిక వహించనుందని తెలిపారు. అగ్రనేతలిద్దరి భేటీలో ఇరు దేశాల ఉన్నతాధికారులతో పాటు భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, కార్యదర్శి శ్రింగ్లా, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోభాల్, అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు తదితరులు పాల్గొన్నారు.
భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు: బైడెన్
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని కల్పించే విషయంలో తాము పూర్తి మద్దతునిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పునరుదోటించారు. మోదీ, బైడెన్ సమావేశం అనంతరం ఓ సంయుక్త ప్రకటన విడుదలైంది. ‘శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ఎన్నో ఏండ్ల నుంచి పోరాడుతున్నది. ఆ దేశం కల సాకారం కావడానికి అమెరికా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అంతేగాక న్యూక్లియర్ సైప్లెయర్స్ గ్రూప్ (ఎన్‌ఎస్‌జీ)లో భారత్ ప్రవేశించడానికి కూడా అమెరికా అండగా నిలుస్తుంది’ అని ఆ ప్రకటనలో బైడెన్ పేర్కొన్నారు.
బైడెన్‌తో హెచ్1బీ వీసా అంశంపై చర్చించిన ప్రధాని మోడీ
మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌తో కీలక అంశాలపై చర్చలు జరిపారు. అమెరికాలోని భారత కమ్యూనిటీ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. భారతీయ ప్రొఫెషనల్స్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉండే హెచ్1బీ వీసా అంశంపైనా మోడీ.. బైడెన్‌తో చర్చించారు. ఈ మేరకు వివరాలను విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా వెల్లడిరచారు. భారతీయ నిపుణులకు ఎంతో కీలకమైన హెచ్1బీ వీసా అంశంపై బైడెన్‌తో ప్రధాని మోడీ చర్చించారు. అనేక మంది భారతీయ నిపుణులు ఇక్కడ పనిచేస్తున్నారని, మరికొంతమంది ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇక్కడ భారతీయ నిపుణులకు లభించే ప్రాధాన్యతను బట్టి ఈ దేశానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఈ దేశానికి వారు తమవంతుగా సేవలనందిస్తున్నారని తెలిపారు. అమెరికా ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారన్నారు.
అమెరికా ఎన్నారైలను ఆకర్షించిన ప్రధాని
అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి ఎన్నారైలతో ముచ్చటిస్తూ, ప్రపంచవ్యాప్తంగా భారత సంతతికి చెందిన వారు ప్రత్యేకంగా కనిపిస్తారని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్నారైలే మన దేశ బలమని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. వారితో సమావేశమైన ఫొటోలు షేర్ చేశారు.ప్రధాని మోదీ ఏ దేశం వెళ్లినా ప్రవాస భారతీయులతో కచ్చితంగా సమావేశమవుతారు. ఈసారి కోవిడ్`19 కారణంగా పెద్ద పెద్ద సమావేశాలేవీ పెట్టుకోలేదు. అమెరికాలోని ఎన్నారైల్లో ప్రధానికి మంచి ఆదరణ ఉంది. దీంతో ఆయన అమెరికా పర్యటనకు ప్రవాస భారతీయుల నుంచి పెద్దఎత్తున మంచి స్పందన వస్తోంది.
మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన విజయవంతమైందని చెప్పవచ్చు. కరోనా పోరులో భారత్ నిర్వహిస్తున్న పాత్ర, భారత్`అమెరికా సంబంధాల వృద్ధికి, పాక్, ఆప్ఘనిస్తాన్ ఉగ్రవాదుల అడ్డాగా మారిందన్న విషయాన్ని తెలియజేస్తూ చేసిన ప్రసంగం, సిఇఓలతో సమావేశమై భారత్ అభివృద్ధిలో వారిని పాలుపంచుకునేలా చేయడం వంటివి ఆయన పర్యటన విజయంతాన్ని తెలియజేస్తోంది.
- టి. గోవిందరాజన్