మా మనస్సు ఇక్కడే ఉంది...మోహన్ నన్నపనేని
మేము అమెరికాలో ఉన్నా మా మనస్సు మాత్రం ఎప్పుడూ మాతృభూమిపైనే ఉంటుందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు మోహన్ నన్నపనేని చెప్పారు. మాతృభూమిపై ఉన్న అభిమానంతోనే తానా ఆధ్వర్యంలో మాతృరాష్ట్రాలలో ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నామని చెప్పారు. నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ హాలులో తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో మోహన్ మాట్లాడుతూ, తెలుగు సంప్రదాయాలను కాపాడటంలో, కళలను పరిరక్షించడంలో తానా ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. 300 కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థ ‘తానా’ ఒక్కటేనని అంటూ, తానా ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలను, పాఠశాల భవనాల నిర్మాణానికి సాయపడటం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను తానా చేస్తోందన్నారు. మొదటిసారిగా నెల్లూరులో తానా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎంతో ఉన్నతమైన మన దేశ సంస్కృతిని కాపాడుకోవడంతోపాటు, రేపటితరానికి అందించాలన్న ఉద్దేశ్యంతో ఇలాంటి కార్యక్రమాలను ఎన్నారైల సహకారంతో చేస్తున్నామని చెప్పారు. అంతరించిపోతున్న మన ప్రాచీన కళలను చిన్నారులకు పరిచయం చేయడం కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగువాళ్ళ తరపున ఇండియాలోని తెలుగువాళ్ళ తరపున వారధిగా ఉంటున్నామని చెప్పారు.
View Event Gallery Part-1 View Event Gallery Part-2