ASBL Koncept Ambience

మన ఇంటి వేడుక - కవిత

మన ఇంటి వేడుక - కవిత

రాష్ట్రంలో తెలుగు భాష వైభవాన్ని చాటేలా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు మన ఇంటి పండుగ లాంటిదని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.  హైదరాబాద్‌ రవీంద్రభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు మహాసభల కార్యాలయాన్ని మహాసభల నిర్వహణ కోర్‌కమిటీ సభ్యులతో కలిసి ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రపంచంలోని తెలుగు వారందరి పండుగ అని మన ఇంట్లో వేడుక జరుపుకొంటున్నప్పుడు ఎలాగయితే సంతోషంగా పాల్గొంటామో, ఈ మహాసభల్లోనూ కూడా అంతే సంతోషంగా అందరూ పాల్గొనాలని అన్నారు. ప్రపంచంలోని తెలుగు వారందరూ గర్వపడేలా తెలుగు  మహాసభలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్త్తోందన్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉన్న భాషావేత్తలు, కవులు, రచయితలు, కళకారుల్ని ఈ మహాసభలకు ఆహ్వానిస్తామని ఆమె చెప్పారు. తెలంగాణలో తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు వైభవానికి జరిగిన కృషిని ప్రపంచానికి చాటుతామని ఆమె సృష్టం చేశారు. తెలంగాణ కవులెందరో కావ్యాలు రాశారని, గొప్ప రచనలెన్నింటినో చేశారని వారందరినీ గుర్తు చేసుకోవటానికి ఈ సభలు మంచి వేదిక అని అమె చెప్పారు. కోర్‌ కమిటీ సభ్యులతో కలిసి తెలుగు మహాసభల లోగోను ఆమె ఆవిష్కరించారు. అనంతరం కొత్త కార్యాలయంలో ఎంపీ కవిత ప్రత్యేక అతిథిగా కోర్‌కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి జిల్లాలలోని సాహిత్య సాంసృతిక  సంస్థలు మహాసభలలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకొంటామని తెలిపారు.

సుమారు 250 స్వచ్ఛంద, సాహిత్య కళా సంస్థలు సేవలను అందించనున్నాయని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి చెప్పారు. కాగా, డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు నిర్వహించే తెలుగు మహాసభల వివరాలను భాష-సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ ఈ సందర్భంగా వివరించారు. మహాసభల్లో 6500 మంది ప్రతినిధులు పాల్గొంటారని ఆయన చెప్పారు. మొత్తం అయిదు వేదికలపై వీటిని నిర్వమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక, పర్యాటకశాఖ కార్యదర్శి బీ వెంకటేశం, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఎస్వీ సత్యనారాయణ, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, గ్రంధాలయసంస్థ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌, టీఎస్‌బీసీఎల్‌ చైర్మన్‌ దేవీప్రసాద్‌, కొణతం దిలీప్‌, శైలజ, తుల ఉమ, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదరిశ నవీన్‌ చారి, పలువురు కవులు, రచయితలు, కళాకారులు, భాషాభిమానులు పాల్గొన్నారు.

మహాసభల వేదిక వివరాలు

ప్రధాన వేదిక : ఎల్బీ స్టేడియం
మిగతా వేదికలు : ఎన్టీఆర్‌ ఆడిటోరియం ( తెలుగు విశ్వవిద్యాలయం), లలిత కళాతోరణం (పబ్లిక్‌ గార్డెన్స్‌),
ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం (పబ్లిక గార్డెన్స్‌) 
రవీంద్రభారతి : శాస్త్రీయసంగీతం, నృత్యం, నాటకం
పైడి జయరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌ (రవీంద్రభారతి) లఘు చిత్రాల పోటీ
తెలుగు లలితకళాతోరణం : జానపద కళల ప్రదర్శన
ఎన్టీఆర్‌ ఆడిటోరియం (తెలుగు వర్సిటీ) భాషా, సాహిత్య చర్చాగోష్ఠులు, సాహిత్యంలో తెలంగాణపై చర్చ, కవి సమ్మేళనాలు
ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం (పబ్లిక్‌ గార్డెన్స్‌) బాలోత్సవం

Click here for Event Gallery

 

Tags :