తెలుగు భాషాభిమానులంతా మహాసభలకు అతిధులే...
తెలుగు టైమ్స్ ఇంటర్వ్యూలో నందిని సిధారెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్వహిస్తున్న తొలి తెలుగు ప్రపంచ మహసభలకు తెలుగుభాషపై అభిమానం ఉన్నవారంతా అతిధులేనని, అందరూ ఈ మహాసభలకు తరలిరావచ్చని ఇందులో ఎలాంటి ప్రాంతీయతత్వానికి చోటు లేదని ప్రపంచ తెలుగు మహాసభల కోర్ కమిటీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందినీ సిధారెడ్డి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని ఆయన 'తెలుగు టైమ్స్'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.
ప్రపంచ తెలుగు మహాసభల ముఖ్య ఆశయమేమిటి?
తెలుగు భాషా వికాసాలకు తెలంగాణ పుట్టినిల్లు, ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. తెలంగాణలో పరిఢవిల్లిన భాషా సాహిత్య వారసత్వ చరిత్రను చూస్తే తెలుగు భాషకు జన్మస్థలం తెలంగాణ అనే కనిపిస్తుంది. తెలుగుపై అభిమానంతో, తెలుగు సాహితీ వికాసంలో తెలంగాణవారి మహత్తర కృషిని లోకానికి చాటి చెప్పాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈ మహాసభలను నిర్వహిస్తున్నారు. ఆయన ఆశయానికి తగ్గట్టుగా తెలుగు మహాసభల్లో తెలంగాణ కవుల సాహితీ ప్రక్రియను లోకానికి చాటేలా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము.
తెలంగాణలోనే తెలుగు పుట్టిందనడానికి ఆధారాలేమిటి?
తెలుగుభాష పుట్టిననేల తెలంగాణ. దీనికి సంబంధించి మనకు ఎన్నో ఆధారాలు కనిపిస్తాయి. ఆరుద్ర సమగ్రాంధ సాహిత్య సంపూటాలలో తెలింగం వారసులే తెలుంగువాళ్లు అని కనిపిస్తుంది. వాళ్లు మాట్లాడేభాష తెలుంగు, బర్మాకు వలసవెళ్లిన త్లైంగ్‌లు కూడా తెలుగువాళ్లే. అందువల్ల తెలుంగు మాట్లాడే గణమే తెలంగాణము. కాలక్రమంలో ఇది తెలంగాణ ప్రాంతంగా రూపుదిద్దుకున్నది. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతులు మూలాలుగా కలిగి భాసిల్లిన గణమే తెలంగాణము. తెలంగాణమే తెలంగాణ మాగాణం. శాతవాహనులకు పూర్వమే తెలుగుభాష ఆనవాళ్లు ఉన్నాయని చరిత్ర పరిశోధకులు ఇప్పటికే చాలా ఉదాహరణలను వెలికితీశారు. క్రీ.పూ. 250 నాటికే తెలంగాణలో తెలుగు వాడుకలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇకపోతే ప్రపంచ ప్రసిద్ధిచెందిన హాలుడి గాథాసప్తశతిలోని ప్రాకృత ఛందస్సులో అత్త అనే పదం ఉన్నది. దీనిని సుప్రసిద్ధ పాత్రికేయులు తిరుమల రామచంద్ర నిరూపించారు. కరీంనగర్‌లో క్రీ.శ. 947 నాటి కురిక్యాల శాసనంలోని కందపద్యం ఆధారంగా నన్నయ్యకు 150 సంవత్సరాల పూర్వమే తెలంగాణలో చందోబద్ధ రూపాలనేని ఉన్నట్లు సృష్టమయింది. పంపన రాసిన వృతాలు తెలంగాణ భాష చారిత్రక వారసత్వ సాహిత్య వైభవాన్ని చాటిచెప్తున్నాయి.
మహాసభల్లో మీ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి?
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత నిర్వహిస్తున్న తొలి మహాసభలు ఇవి. ఇందులో తెలంగాణ సాహిత్యానికి పెద్దపీట వేయడంతోపాటు, తెలుగుకు తొలి ప్రాతిపదిక, భూమిక తెలంగాణ నుంచి వచ్చాయన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేసేలా కార్యక్రమాలు ఉంటాయి.
మహాసభలకు ఇప్పటివరకు వచ్చిన స్పందన ఏమిటి?
తెలంగాణలో జరుగుతున్న తొలి మహాసభలు ఇవి. ఈ మహాసభల విజయవంతానికి ఏర్పాటు చేసిన కమిటీలు చేసిన ప్రచారానికి మంచి స్పందనలే వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాషాభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ మహాసభలకు వచ్చేందుకు చాలామంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 6,000 నుంచి 8,000 మందిదాకా ఈ మహాసభలకు హాజరుకావచ్చని మేము అనుకుంటున్నాము.
ఆతిధ్య వివరాలేమిటి?
మహాసభల కోసం వస్తున్న అతిధులకు అందుకుతగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. రిజిష్టర్ చేసుకున్న ప్రతినిధులు కార్యాలయానికి వచ్చినప్పుడు వారికి మహాసభలకు సంబంధించిన సామాగ్రిని అందజేస్తాం. అందులో వాళ్ళ పాస్, కార్యక్రమాల వివరాలు, భోజన కూపన్‌లు ఉంటాయి. వచ్చినవారందరికీ భోజనం వేదిక దగ్గరనే ఏర్పాటు చేశాము. ప్రతినిధులు విడిది చేసిన చోటు నుంచి వేదిక వద్దకు, తిరిగి వారు విడిదికి చేరుకునేందుకు వీలుగా రవాణా సౌకర్యం?కూడా కల్పించాము. మా అతిధులను మూడు రకాలుగా విభజించాము. అందులో మేము ఆహ్వానించినవాళ్ళు, సంఘాల ప్రతినిధులు, రిజిష్టర్డ్ చేసుకున్న అతిధులు ఇలా మేము విభజించుకున్నాము.
మహాసభలకు హాజరయ్యేందుకు వచ్చేవారు వివరాలకోసం సాహిత్య అకాడమీ నెంబర్ 040 29703142లేదా 040 29703152కు ఫోన్ చేయవచ్చు. లేదా బస్‌స్టాండ్‌లో, రైల్వేస్టేషన్‌లలో ఏర్పాటు చేసిన కియోస్క్ మిషన్‌ల ద్వారా కూడా సమాచారాన్ని అందుకోవచ్చు. దాంతోపాటు ప్రధానమైన చోట్ల డిజిటల్ డిస్‌ప్లేలను కూడా ఉంచుతున్నాము. దీని ద్వారా తమకు కావల్సిన కార్యక్రమాన్ని వారు ఎంపిక చేసుకుని ఆ సమయానికి వచ్చి తిలకించవచ్చు.
రిజిష్టర్డ్ చేసుకోని వాళ్ళ మాటేమిటి?
మహసభలకు రిజిష్టర్డ్ చేసుకోకపోయినా భాషాభిమానులు ఎవరైనా సభలను తిలకించాలంటే గ్యాలరీలో నుంచి కూర్చుని తిలకించవచ్చు. చర్చలను వినవచ్చు. అన్నీ ప్రదర్శనలు చూడవచ్చు.
ప్రత్యేక ప్రచురణలు ఏవైనా ఉన్నాయా?
మహాసభలను పురస్కరించుకుని తెలుగు అకాడమీ 70 మోనోగ్రాఫ్‌లను ప్రచురిస్తోంది. మరుగునపడిన తెలంగాణ కవులను దీనిద్వారా వెలుగులోకి తీసుకువస్తున్నాము. సాహిత్య అకాడమీ 10 పుస్తకాలను ప్రత్యేకంగా వెలువరిస్తోంది. తెలుగు విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా ఓ సంచికను మహాసభల సందర్భంగా ఆవిష్కరిస్తోంది. ఇతర మ్యాగజైన్‌లు కూడా ప్రత్యేక సంచికలను తీసుకువస్తున్నాయి.