నంద్యాల ఎన్నిక చూసి షాక్ తిన్న ఎమ్మెల్యేలు, మంత్రులు
నంద్యాల ఉప ఎన్నికతో నేతలకు తెలిసి వచ్చింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాము ఎంత కష్టాలను ఎదుర్కొనాల్సి వస్తుందో వారు నంద్యాలలో ప్రత్యక్షంగా చూశారు. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల్లో ఇప్పుడు నంద్యాల పైనే చర్చ జరుగుతోంది. నంద్యాల ఉప ఎన్నిక కోసం పది మంది మంత్రులు, పాతిక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేశారు. వైసీపీ తరుపున కూడా పది మంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు పాల్గొన్నారు. అయితే నంద్యాల ఉప ఎన్నిక చూసిన తర్వాత వీరి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఉప ఎన్నిక కోసం పెట్టిన ఖర్చు చూసి వీరు నోరెళ్ల పెట్టాల్సి వచ్చింది. ప్రచారం, ఓటర్లకు డబ్బు పంపిణీ వంటి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసిన వారంతా లబోదిబో మంటున్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని వచ్చిన ఎమ్మెల్యేలు మాట్లాడుకున్న తీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
వచ్చే ఎన్నికల్లో ఎలా అని బెంగ…..
ఒక్క ఉప ఎన్నికలోనే ఓటుకు రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకూ ఇచ్చారు. రెండు ప్రధాన పార్టీలూ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడాన్ని దాదాపు యాభై మందికి పైగా రెండు పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు చూశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాము కూడా ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుందని భయపడుతున్నట్లు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పరస్థితే సాధారణ ఎన్నికల్లో వస్తే ఎలా అని ఆవేదన చెందుతున్నారు. ఇందుకోసం కొందరు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ఓటుకు నోటు మాత్రమే కాకుండా, ప్రచారం ఖర్చు కూడా కోట్లు దాటడంతో ఎమ్మెల్యేల్లో ఇప్పటి నుంచే బెంగ పట్టుకుంది. మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నిక అక్కడికి ప్రచారానాకి వెళ్లి వచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులకు ఒక గుణపాఠం తెచ్చిపెట్టిందనే చెప్పొచ్చు.