మంగళగిరిని.. మరో గచ్చిబౌలిని చేస్తా
భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూసేలా అభివృద్దిలో నంబర్ వన్ చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, నవులూరు, బేతపూడి, నీరుకొండ, కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో నాన్నగారు (చంద్రబాబు) గచ్చిబౌలి కట్టారు, అదే స్ఫూర్తితో నేను మన మంగళగిరిని మరో గచ్చిబౌలిని చేస్తా. మన ముఖ్యమంత్రి అమరావతిలో యుద్దప్రాతిపదికన రహదారులు, పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నారు. ఎస్‌ఆర్‌ఎం, విట్ విశ్వవిద్యాలయాలను అమరావతికి తెచ్చాం. ఇంత అభివృద్ధి జరుగుతున్నా ప్రతిపక్ష నాయకుడికి ఇవేమీ కనిపించడటం లేదు. జగన్, మోదీ, కేసీఆర్‌లు ఒక్కటై చంద్రబాబును ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
విభజన చట్టంలోని అంశాలు అమలు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా అడిగితే, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో మన ఎంపీలపై దాడులు చేయిస్తారు. అయినా దేనికీ భయపడేది లేదు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని 18 అంశాలను అమలు చేసే వారినే ప్రధానిగా చంద్రబాబు చేస్తారు. నేను ఐటీశాఖ మంత్రిగా మంగళగిరికి అనేక ఐటీ సంస్థలు తీసుకొచ్చాను. ఈ సంస్థల ద్వారా అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయి. కుల, మత ప్రాంతాలకు అతీతంగా మనమంతా కలిసి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును గెలిపించుకోవాలి. నన్ను ఆశీర్వదించండి, గెలిపించండి అంటూ మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.