ప్రధాని ఎవరో నిర్ణయించేది చంద్రబాబే
రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. లోటు బడ్జెట్‌లోనే ఇలా చేస్తే రాబోయే కాలంలో ఎంతో అభివృద్ధి చేస్తామో ప్రజలంతా ఆలోచించాలని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో లోకేశ్ మాట్లాడారు. ఎమ్మెల్యేగా దాట్ల సుబ్బరాజుని, ఎంపీగా దివంగత స్పీకర్ బాలయోగి తనయుడు హరీశ్‌ను గెలిపించాలని కోరారు. ఎన్నికల తర్వాత దేశ ప్రధాని ఎవరో చంద్రబాబు నిర్ణయించబోతున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీలు ఎవరు నెరవేరుస్తారో వారే దేశ ప్రధాని అవుతారని చెప్పారు. ముమ్మడి వరంలో సమస్యలు పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. దాట్ల సుబ్బరాజు ముమ్మిడివరం అభివృద్ధికి చాలా కృషి చేశారని చెప్పారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే, డిగ్రీ, బీసీ రెసిడెన్సియల్ కళాశాలల నిర్మాణం చేపడతామని లోకేశ్ హామీ ఇచ్చారు.