మంగళగిరిలో గెలుపు నాదే : లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించాలనే యోచనలో వైకాపా అధ్యక్షుడు జగన్ ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ ఆరోపించారు. మేనిఫెస్టోలో అమరావతి పేరును ఎందుకు ప్రస్తావించలేదని వైకాపా నాయకులను ప్రశ్నించాలని ప్రజలను కోరారు. ఉండవల్లిలో ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఎంత కష్టపడుతున్నా ముఖ్యమంత్రిని ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. కేంద్రంలో మోదీ, పక్క రాష్ట్రంలో కేసీఆర్, ఇక్కడ జగన్ ముగ్గురూ కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని కంకణం కట్టుకున్నారని అన్నారు. కేసీఆర్ రిటర్న్ గిప్టు అన్నారు. ఐదు కోట్ల ఆంధ్రులు సిద్ధంగా ఉన్నార. రిటర్న్ గిప్టును సిక్స్ కొట్టేందుకు. నన్ను ఓడించేందుకు వలస పక్షులు పదుల సంఖ్యంలో ప్రచారం చేస్తున్నాయి. ఎంత మంది వచ్చినా మంగళగిరి నియోజకవర్గంలోని 2.68 లక్షల ఓటర్లు నా వైపే ఉన్నారు. నన్ను ఓడించటానికి కేసీఆర్ మంగళగిరి రూ.200 కోట్లు పంపారు అని అరోపించారు.
అమరావతి శంకుస్థాపనకు వచ్చిన నరేంద్రమోదీ చెంబుడు నీళ్లు, మట్టి మన ముఖాన కొట్టి మోసం చేశారని అన్నారు. నీళ్లు, మట్టి ఇచ్చి మోదీ తిరిగి చూడలేదన్నారు. రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇవి డ్రైనేజీకి సరిపోవన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతతో ఎవరూ ఊహించని విధంగా రహదారులు, భవనాలు నిర్మించామని చెప్పారు. ఉండవల్లిలో దాదాపు 2,500 మంది రైతు కూలీలకు నెలనెలా రూ.2,500 పింఛన్ అందజేస్తున్నానని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలా జరగలేదని తెలిపారు. కొందరు రాజధానికి భూములు ఇంకా ఇవ్వాల్సి ఉందని, వారి కోరికలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఎలా పరిష్కరించాలో పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.