చికాగోలో నారా లోకేష్
స్మార్ట్‌విలేజ్ - స్మార్ట్ వార్డ్ కార్యక్రమ ప్రచారంలో భాగంగా నారా లోకేష్ చికాగోకు వచ్చినప్పుడు ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఓహేర్ విమానాశ్రయంలో ఆయనకోసం వేచి ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆయనకు పుష్పగుచ్చాలను బహూకరించి స్వాగతం పలికారు. రవి ఆచంట, ధృవచౌదరి, హేమ కానూరు, వినోజ్ చనుమోలు ఇతర అభిమానులు ఆయనకు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. తరువాత స్మార్ట్‌విలేజి కార్యక్రమంపై ఎన్నారైలతో లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలన్న తలంపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలవాలంటే గ్రామ స్థాయి నుంచే అభివృద్ధి జరగాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు ఈ స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు లోకేష్ వివరించారు. ఎన్నారైలంతా గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధిపరిచేందుకు ముందుకురావాలని కోరారు. స్మార్ట్‌విలేజ్‌పై ఎన్నారైలకు ఉన్న సందేహాలకు ఆయన సమాధానాలిచ్చారు.