ASBL Koncept Ambience

వాషింగ్టన్‌ డిసిలో నారా లోకేష్‌ - 2000 గ్రామాల దత్తత

వాషింగ్టన్‌ డిసిలో నారా లోకేష్‌ - 2000 గ్రామాల దత్తత

అమెరికాలో స్మార్ట్‌ విలేజి కార్యక్రమంపై ఎన్నారైలతో ముఖాముఖీగా సమావేశమవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం పార్టీ యువనాయకుడు నారా లోకేష్‌ ఆదివారంనాడు వాషింగ్టన్‌డిసికి వచ్చినప్పుడు ఆయనకు ఘనమైన స్వాగతం లభించింది.

లోకేష్‌ కార్యక్రమ సమన్వయకర్త స్థానిక తెలుగు ప్రముఖుడు సతీష్‌ వేమన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం రన్‌వేపైనే లోకేష్‌ స్వాగత సత్కార ఏర్పాట్లు చేయడం విశేషం. అమెరికాలో పెద్ద పెద్ద ప్రముఖులకు మాత్రమే రన్‌వేపై స్వాగతం పలుకుతుంటారు. అలాంటి స్వాగత సత్కారాన్ని సతీష్‌ వేమన ఆధ్వర్యంలో స్థానిక టీడిపి శ్రేణులు ఏర్పాటు చేయడం విశేషం. భారీ కార్ల ర్యాలీతో అభిమానులు వెంటరాగా లోకేష్‌ వేదిక వద్దకు చేరుకున్నారు. రేంజ్‌ రోవర్‌ కార్ల ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది.

హయత్‌ డల్లాస్‌లో జరిగిన ముఖాముఖీ సమావేశానికి పెద్ద సంఖ్యలో ఎన్నారైలు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ వాషింగ్టన్‌ డీసిలో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇంత ఉత్సాహంగా తనను ఆహ్వానించడంపట్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తమమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్మార్ట్‌ విలేజీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధి గ్రామస్థాయి నుంచే జరగాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని లోకేష్‌ తెలిపారు. స్మార్ట్‌ విలేజి పథకం లక్ష్యాలను లోకేష్‌ వివరించడంతోపాటు వారి సందేహాలను తీర్చారు. 

ఈ సందర్భంగా డిట్రాయిట్‌ తెలుగు ప్రముఖుడు కృష్ణప్రసాద్‌ కాట్రగడ్డ స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమానికి లక్ష డాలర్లను తానా తరపున విరాళంగా ఇస్తున్నట్లు  ప్రకటించారు. తానా ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేస్తోందని గ్రామస్థాయిలో ఈ పథకాలు సరిగా అమలయ్యేలా చూడాలని కోరారు. ఇందుకు స్పందించిన లోకేష్‌ విరాళాలు సద్వినియోగమయ్యేలా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పారు. కాట్రగడ్డ కృష్ణ ప్రసాద్‌ను నారా లోకేష్‌ ఘనంగా సత్కరించారు. 

వాషింగ్టన్‌ డిసి, మేరీలాండ్‌, వర్జీనియా రాష్ట్రాల్లోని ఎన్నారైలు, టీడిపి అభిమానులు ఈ సమావేశానికి వచ్చారు. దాదాపు 2వేల గ్రామాలను స్మార్ట్‌విలేజి కింద దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ గ్రామాలన్నింటిని తానా - ఎన్నారై తెలుగుదేశం పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో అభివృద్ధిపరచనున్నట్లు సతీష్‌ వేమన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప్పుటూరి రామ్‌చౌదరి, చనుమోలు నీలిమా, రమాకాంత్‌ కోయ, త్రిలోక్‌ కంతేటి, బత్తినేని సోదరులు, రవి పొట్లూరి, మల్లిక్‌, ఎన్‌ఆర్‌సి నాయుడు, ఉప్పుటూరి చినరాములు, జడ్‌పిటిసి సభ్యురాలు ఉప్పుటూరి సీతామాలక్ష్మీ, చెన్నుపాటి కిశోర్‌, సత్యనారాయణ మన్నె, కృష్ణ గ్రంథి, బుచ్చిరాంప్రసాద్‌, బండా ఈశ్వర్‌ రెడ్డి, రాము జక్కంపూడి, శ్రీనివాస్‌ అనుమోలు, జనార్థన్‌ నిమ్మలపూడి, అశోక్‌ దేవినేని, నాగ్‌ నెల్లూరి, గౌతమ్‌ అమిరినేని, రామ మట్టపల్లి, రఘు ఎద్దులపల్లి, భరత్‌ నాగల్ల, సుబ్బా కొల్లా, మల్లి వేమన, కళ్యాణ్‌ చాగంటి, శ్రీనివాస్‌ పెందుర్తి తదితరులు పాల్గొన్నారు. 


Click here for PhotoGallery
 

 

Tags :