ఐటీరంగ ప్రముఖులతో సమావేశమైన లోకేష్
వరుసగా 4వ రోజు కూడా లోకేష్ సమావేశాలు
సాంకేతిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతోపాటు, నెట్‌వర్క్ సౌకర్యాలను మరింత మెరుగ్గా చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను మరింతగా అభివృద్ధి చేయవచ్చన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా అమెరికాలో తన పర్యటనను నారా లోకేష్ చేస్తున్నారు. గత మూడురోజులుగా వివిధరంగాల ప్రముఖులను, పారిశ్రామికవేత్తలను కలుసుకున్న ఆయన నాలుగవరోజు పర్యటనల్లో కూడా అదే ఒరవడిని కొనసాగించారు. నెట్‌వర్క్ రంగంలో పేరు పొందిన జూనిపర్ సిటిఓ ప్రదీప్ సింధుతో ఆయన భేటీ అయ్యారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి 15ఎంబిపిఎస్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌ను ఈ సందర్భంగా లోకేష్ ఆయనకు వివరించారు.
ఈ విజన్‌పై ఆయన ఆసక్తిని చూపడంతోపాటు తనవంతుగా ఇందుకు సహకరిస్తానని చెప్పారు. తరువాత విజయ గద్దె (జనరల్ కౌన్సెల్, ట్విట్టర్)ను కలసి డీజిటల్ రంగంలో మహిళలకు కల్పిస్తున్న అవకాశాలను, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేపట్టిన బాలికల విద్య వంటి విషయాలను వివరించడం జరిగింది. మీ అభివృద్ధి కార్యక్రమాలకు సామాజికమాధ్యమం ద్వారా ప్రచారం కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పారు. అరుబ నెట్‌వర్క్స్ సిటిఓ, ఫౌండర్ కిర్తి మెల్కొటేను కలిసి సాంకేతికరంగంలో సహకరించాల్సిందిగా కోరడం జరిగింది. ఇన్‌ఫోసిస్ సిఇఓ విశాల్ సిక్కాను కూడా కలుసుకుని వైజాగ్‌లో ఇన్‌ఫోసిస్ నెలకొల్పనున్న డెవలప్‌మెంట్ సెంటర్ పనులపై చర్చించడం జరిగింది.