ఒబామాను కలిసిన నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలు, రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై అమెరికాలోని ఎన్నారైలకు తెలియజేసేందుకు వీలుగా మే 3 నుంచి అమెరికాలో లోకేష్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలను లోకేష్ స్వయంగా కలుసుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాల గురించి వారికి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ విలేజ్ - స్మార్ట్ వార్డ్ కార్యక్రమంలో ఎన్నారైల భాగస్వామ్యం కోసం వారితో ముఖాముఖీ మాట్లాడారు.
తన తొలి సమావేశంలోనే దాదాపు 160కి పైగా గ్రామాలను ఎన్నారైలు దత్తత తీసుకునేలా వారిని చైతన్యపరిచారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను పోర్ట్‌లాండ్‌లో లోకేష్ ఈరోజు కలుసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, పెట్టుబడుల ఆహ్వానంలో అనుసరిస్తున్న విధానాలను, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు సంగతులను తెలియజేసినట్లు తెలుగు దేశం పార్టీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఒబామా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు గురించి తాను విన్నట్లు తెలియజేశారు. చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు అందించాలని చెప్పినట్లు ఎల్.వి.ఎస్.ఆర్. కే. ప్రసాద్ తెలిపారు.