ముగ్గురు దొంగలకు తెలియని విషయం ఒకటుంది
రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ముగ్గురు దొంగలు కలిసి చంద్రబాబును ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన మంగళగిరి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకరు ప్రధానమంత్రి మోదీ, ఇంకొకరు పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్, మూడో వ్యక్తి దొంగబ్బాయి జగన్ అని అన్నారు. ఈ ముగ్గురు కలిసి ఏపీలో చంద్రబాబు గెలవకూడదని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కానీ వారికి తెలియని విషయం ఒకటుందన్నారు. ప్రజలంతా చంద్రన్నతో ఉన్నారని, ఆంధ్రులు అనుకుంటే ఈ కుట్రదారులను తరిమి తరిమి కొడతారని ఆయన అన్నారు.
ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం జగన్‌కు కేసీఆర్ ఏకంగా రూ.వెయ్యి కోట్లు ఇచ్చారని ఆరోపించారు. అలాగే రంగులు మార్చి వాహనాలు పంపించారని, కానీ సీటు కవర్లు మార్చడం మర్చిపోయారని ఎద్దేవా చేశారు. గులాబీ రంగు సీటు కవర్లు ఉన్నాయన్నారు. దీనిబట్టి చూస్తే చంద్రబాబుపై ఎంత కుట్ర జరుగుతుందో అర్థమవుతుందని అన్నారు. వైసీపీ అద్భుతమైన డ్రామా కంపెనీగా మారిందని, ఆ కోడికత్తి పార్టీ వ్యవహారం అందరికీ తెలిసిందేనని అన్నారు.