మరో గచ్చిబౌలిగా మంగళగిరి : లోకేశ్
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాల కోసం ఒక పక్కన కృషి చేస్తూనే.. మరోపక్క పరిశ్రమల స్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఐటీ శాఖ మంత్రి లోకేశ్ అన్నారు. మంగళగిరి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు, ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. యువతీ, యువకులకు సొంత జిల్లాలోనే ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. ఐటీ మంత్రిగా మంగళగిరికి ఐటీ పరిశ్రమలను పెద్ద ఎత్తున తీసుకువస్తున్నానని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థిగా తాను నిలబడ్డానని, భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. రానున్న ఐదేళ్లలో ఐటీ పరిశ్రమలను మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మరో గచ్చిబౌలిగా మంగళగిరిని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కొందరు నేతలు కులాల ప్రస్తావన తెస్తున్నారని, కొందరు రేపు మతాన్ని, ప్రాంతాన్ని కూడా తీసుకొస్తారని విమర్శించారు. మన కులం మంగళగిరి, మన మతం మంగళగిరి, మన ప్రాంతం మంగళగిరి అని అన్నారు. మచ్చలేని కుటుంబాలపై కుట్రలు పన్ని కేసులు పెడుతున్నారని ఆరోపించారు.