విధేయత... విశ్వసనీయతే నా బలం.. నరేన్ కొడాలి
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా)లో దాదాపు 2 దశాబ్దాలకు పైగా ఉన్న అనుభవం, వివిధ పదవులను నిర్వహించి తానాలో అందరికీ పరిచయం ఉన్న నరేన్ కొడాలి ప్రస్తుతం జరుగుతున్న తానా ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నారు. తానాలో చిన్న పదవుల నుంచి బోర్డ్ చైర్మన్ వరకు వివిధ పదవులను చేపట్టడంతో పాటు సభ్యులకు, కమ్యూనిటీకి మంచి ఎలా చేయాలో బాగా తెలిసిన వ్యక్తి, దానికితోడు ప్రొఫెషనల్‌గా ప్రొఫెసర్ పదవిని నిర్వహిస్తున్న నరేన్ కొడాలి ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, వీడియోల ద్వారా, డైరెక్టుగా సభ్యులతో, టీమ్‌తో మమేకమై పని చేస్తున్నారు. ఎన్నికలను పురస్కరించుకుని తెలుగు టైమ్స్ ఆయనను ఇంటర్వ్యూ చేసినప్పుడు పలు విషయాలను వెల్లడిరచారు.
తానాతో ఉన్న అనుబంధాన్ని చెప్పండి?
తానాతో నాకు 2 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. 2005 నుంచి తానాలో వివిధ పదవులను చేపట్టాను. 2005లో తానా ఐటీ కమిటీ కో చైర్‌గా పని చేసిన తరువాత కాన్ఫరెన్స్ చైర్మన్‌గా, బోర్డ్ డైరెక్టర్‌గా, చైర్మన్‌గా కూడా పదవులను నిర్వహించాను. తానా బైలాస్ కమిటీ మెంబర్‌గా, లీగల్, ఇతర వ్యవహారాల కమిటీల్లో కూడా పనిచేసిన అనుభవంతో తానాకు మరింతగా సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నాను.
ప్రస్తుత ఎన్నికల్లో గత ఎన్నికల్లో మార్పు అనే పదం కీలకంగా కనిపించింది? దీనిపై మీరేమంటారు?
తానా సంస్థకి ఇప్పుడు 46 ఏళ్ళు. ప్రతి సంవత్సరం ఎన్నో కొత్త పనులు చేస్తోంది. గతంలో చేపట్టిన పనులను మరింత విస్తృతపరిచి ఎంతోమందికి ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. కమ్యూనిటీకి ఎప్పుడు ఏది అవసరమో అది చేయగల సత్తా ఒక్క తానాకే ఉంది. అలాంటి బలమైన తానాలో ‘‘మార్పు’’ చేయాలి, చేస్తాము అని చెప్పడమే అవివేకం. అనవసరం కూడా. తానాలో అప్పుడు ఇప్పుడు పరిస్థితులు బాగానే ఉంది. ఇన్ని సంవత్సరాలుగా మంచి పనులు చేస్తూ, మరింతమందిని సభ్యులుగా ఆహ్వానిస్తూ, వారికి మెంబర్‌షిప్ ఇచ్చి చేర్చుకొంటూ ముందుకెళ్తోంది. వేలాదిమంది సభ్యులతో 4 దశాబ్దాలకుపైగా కమ్యూనిటీలో బలంగా ఉన్న తానాని ఏదో చేస్తామని, సమూలంగా మార్పులు తీసుకువస్తామని చెప్పినా నమ్మాల్సిన పనిలేదు. ఎందుకంటే తానా ఎప్పటికప్పుడు కమ్యూనిటీకి తగ్గట్టుగా మారుతూ ఉంటోంది. కొత్త సభ్యుల రాకతో ఆటోమేటిక్‌గా మార్పులు జరిగిపోతాయి. అందువల్ల ప్రత్యేకంగా మార్చాల్సిన అవసరం లేదు.
అలాగే తానాని ‘ప్రక్షాళన’ చేస్తాం అనటం కూడా తప్పే. తానా లాంటి పెద్ద సంస్థ లో వందల్లో కార్యవర్గ సభ్యులు, వేల సంఖ్యలో సాధారణ సభ్యులు, లక్షల సంఖ్యలో లబ్ధిదారులు ఉంటారు. ఇప్పుడు మనం చేయాల్సింది మార్పులు, ప్రక్షాళన అంటూ మభ్యపెట్టడం కాకుండా తానాని కమ్యూనిటీకి మరింత దగ్గర ఎలా చేయాలన్న దానిపై దృష్టి పెట్టాలి. నా ఆలోచన.. అభ్యర్థన కూడా అదే. అందరి విశ్వసనీయత పెంచాలి అన్నదే నా పాయింట్. అందుకు అందరూ పనిచేయాలి అని నా విజ్ఞప్తి. విధేయత, విశ్వసనీయత, ప్రభావంతమైన సేవ అన్నదే నా స్లోగన్ కూడా.
మెంబర్‌షిప్ వివాదంపై మీ స్పందన?
తానా సంస్థలో కొన్నేళ్ళుగా ఉంటూ, అనేక పదవులను చేపట్టిన నేను కొన్ని అనివార్య పరిస్థితుల్లో గత ఎన్నికల్లో గట్టి పోటీ వాతావరణంలో నిలబడాల్సి వచ్చింది. గెలవకపోయినా 48శాతం సభ్యుల మద్దతు వచ్చింది. దాంతో గెలవకపోయినా తానాకు నా సేవలు కొనసాగించాలని అనిపించింది. ఇటీవల దాదాపు 17వేల మంది కుటుంబాలు (దాదాపు 33,000కు పైగా సభ్యులు) తానా సభ్యత్వం తీసుకున్నారు. వారికి పనులు, బాధ్యతలు, హక్కులు అన్ని ఇవ్వాల్సిన బాధ్యత తానా సంస్థపై ఉంది. కొత్తగా చేరిన సభ్యుడు అన్నీ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. బాధ్యతలు స్వీకరించవచ్చు. ఇంకా చెప్పాలంటే వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయవచ్చు. కాని తను, లేదా ఆమె వోటు వేయడానికి మాత్రం అర్హత లేదు అని చెప్పడం ఎంతవరకు సమంజసం?. మన భారత దేశ రాజ్యాంగంలో కూడా ఎన్నికల కమిషన్ ఎన్నికలు ప్రకటించేటప్పుడే అప్పటి ఓటరు జనాభా వివరాలను పరిశీలిస్తుంది. గమనించి అవసరం అయితే చిన్న చిన్న సవరణలు చేస్తుంది. ప్రపంచంలోనే అది పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారతదేశంలో వోటు హక్కు గురించి అన్నీ కోణాల నుంచి పరిశీలిస్తుంది. తానా కూడా అలాగే చేయాలి. అవసరం అయితే బైలాస్‌ను మార్చుకోవాలి. కాని స్వప్రయోజాలకోసం వారికి ఓటు హక్కు కల్పించకపోవడం అన్యాయం. దీనిపై సభ్యులు కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితిని ఎంవిపి కమిటీ కల్పించింది. ఇప్పటికైనా వారికి ఓటుహక్కు ఇవ్వాలని కోరుతున్నాను. దానిపైనే నేను పోరాడుతూ ఉంటాను.
తానాలో ఎలాంటి కార్యక్రమాలను చేయాలనుకుంటున్నారు?
తానాలో ఎన్నికైన ప్రతి అధ్యక్షుడికి రెండు సంవత్సరాల సమయం ఉంటుంది. అందరూ అనేక ఆశయాలతో, ఆలోచనలతో వస్తారు. వారికిచ్చిన సమయం లో కార్యక్రమాలు చేస్తారు. వెళ్ళిపోతారు. కానీ కొందరి ఆలోచనలతో ప్రారంభమైన కార్యక్రమాలు ఆ అధ్యక్షుడు వెళ్ళిపోయాక కూడా కొనసాగుతాయి. పెద్దవి అవుతాయి. టీమ్ స్క్వేర్ కార్యక్రమం అలాంటిదే. ఈరోజు టీమ్ స్క్వేర్ తానాలో ఒక విభాగంగా మారింది. అలాగే అమెరికాలో జరిగే తానా మహాసభలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో చైతన్య స్రవంతి పేరుతో అనేక సాంస్కృతిక మరియు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. తానా సభలకు ముందు అమెరికాలో పిల్లల కోసం ‘ధీమ్ తానా’ పేరిట పోటీలు నిర్వహిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలన్ని ఏదో ఒక టైంలో ఒక అధ్యక్షుడు మొదలు పెట్టిన కార్యక్రమాలే. నేను కూడా నాకు ఇచ్చిన సమయంలో ఒక పెద్ద కార్యక్రమం చెయ్యాలని, దానిని వచ్చే అధ్యక్షులు కూడా కొనసాగించేలా ఉండేలా ప్రణాళికతో పనిచేయనున్నాను.