తానా ఎన్నికల ఫలితాలు - నరేన్ కొడాలి ప్యానల్ ఫిర్యాదు
తానా ఎన్నికల కౌంటింగ్ ముగిసి, ఎన్నికల్లో నిరంజన్ శృంగవరపు టీమ్ మెజారిటీతో గెలిచినట్లు కౌంటింగ్‍లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీ పడిన నరేన్ కొడాలి వర్గం ఈ ఎన్నికల కౌంటింగ్ తీరుపై, ఎన్నికల సరళిపై, బ్యాలెట్ పత్రాల పోస్టింగ్, చిరునామాలు వంటి వాటిపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ మరోసారి బోర్డుకు ఫిర్యాదు చేసింది. తమ ఫిర్యాదుపై బోర్డ్ చర్చించేంతవరకు ఫలితాలను అధికారికంగా వెల్లడించవద్దని కోరాయి. దీంతో ఈ ఎన్నికల ఫలితాల విషయంలో తానా బోర్డ్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా తానా ఓటర్ల చిరునామాల మార్పుపై నరేన్ కొడాలి వర్గం ఫిర్యాదు చేసిన తరువాత దానిపై చర్చించిన బోర్డ్ తరువాత బ్యాలెట్ పత్రాలను కొత్తగా ముద్రించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు కౌంటింగ్‍పై, ఇతర విషయాలపై కూడా నరేన్ కొడాలి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో బోర్డ్ దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.