ఆకట్టుకున్న నాటా బాంక్వెట్ కార్యక్రమాలు
డల్లాస్‌లో నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) మహాసభల్లో భాగంగా జూన్ 30వ తేదీన రాత్రి బాంక్వెట్ కార్యక్రమం కే బెయిలీ కన్వెన్షన్ సెంటరులో భారీ ఏర్పాట్లతో ప్రారంభమైంది. ప్రార్థన గీతంతో కార్యక్రమాలను ప్రారంభించారు. వచ్చిన అతిధులకు నాటా ప్రెసిడెంట్ కొర్రపాటి శ్రీధర్ రెడ్డి, కన్వీనర్ ఎన్.ఎం.ఎస్.రెడ్డి, ఇతర నాటా నాయకులు స్వాగతం పలికారు. అమెరికా నలుమూలల నుండే గాక భారతదేశం నుండి వచ్చిన అతిథులతో సభాప్రాంగణం కిక్కిరిసిపోయింది. అమెరికాలో స్వాతంత్య్ర దినోత్సవ వారాంతం కావడంతో ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున తరలివచ్చారు. బ్యాంక్వెట్ విందులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో నాటా అడ్వయిజరీ కమిటీ చైర్ డా. ప్రేమ్ రెడ్డి తదితరులను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో నాటా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ప్రసంగిస్తూ తమను వెన్నంటి నడిపిస్తున్న డా.ప్రేమ్ సాగర్ రెడ్డికి, విరాళాలు అందజేసిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, వైకాపా సోషల్ మీడియా నుండి సజ్జల భార్గవరెడ్డి, తెలంగాణా వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, దర్శకుడు ఆర్‌జివి, ఆలీ, లయ, అనంతశ్రీరామ్, ఎస్.పీ.శైలజ తదితరులు హాజరయ్యారు. అనూప్ రూబెన్స్ సంగీత విభావరి అలరించింది. ఈ కార్యక్రమంలో ఆటా, తానా నాయకులు కూడా పాల్గొన్నారు.