తెలుగు వైభవానికి డల్లాస్ రెడీ.. జూన్ 30 నుంచి జులై 2 వరకు నాటా మహాసభలు
ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) డల్లాస్ నగరంలో జూన్ 30 నుండి జూలై 2వ తేది వరకు చరిత్ర లోనే అతి పెద్ద ఎత్తున మహాసభలను నిర్వహించడానికి సమాయత్తమవుతున్నది. డల్లాస్ లోని కే బైలీ హచిన్సన్ సెంటర్ లో అసంఖ్యాకమైన అభిమానుల మధ్య జరిగే ఈ మహోత్సవానికి ఎందరో అతిరధ మహారధులైన తెలుగు సినీ, రాజకీయ, సాంస్కృతిక, జానపద కళాకారులు, క్రీడాకారులు, వ్యాపార వేత్తలు, సంగీత ప్రముఖులు తరలి రానున్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నాటా మహాసభల కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. ఆశేష ప్రజావాహిని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసి తెలుగు మహోత్సవ ప్రారంభ కార్యక్రమాలు అందరినీ అలరించేలా జరగనున్నాయి.
నాటా చేపట్టే ఏ కార్యక్రమం అయినా నూతన ఒరవడి సృష్టిస్తుందనడంలో సందేహం లేదు. అలాగే నాటా వారి కార్యక్రమాలకు ప్రజాదరణ ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మహాసభలు జరిగే చోటు డల్లాస్ మహా నగరం కావడం, అమెరికా, కెనడా నుండి కాక, ఇండియా నుండి కూడా విశేష సంఖ్యలో ప్రేక్షకులు తరలి వస్తారని భావిస్తున్నారు. ఈ మహాసభల్లో తెలుగు సంప్రదాయాలను, కళలను అద్భుతమైన రీతిలో ప్రదర్శించడానికి అత్యున్నతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నాటా అధ్యక్షుడు కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. కాబోయే అధ్యక్షుడు హరి వేల్కూర్, పూర్వాధ్యక్షుడు గోసాల రాఘవరెడ్డి, కార్యదర్శి గండ్ర నారాయణరెడ్డి, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ అధ్యక్షుడు నాగిరెడ్డి దర్గారెడ్డి తమవంతుగా వేడుకల కోసం కృషి చేస్తున్నారు.
తెలుగు సంప్రదాయాలకు పెద్దపీట
నాటా మహాసభల్లో తెలుగు సాంప్రదాయాలను, కళలను, సంగీతాన్ని అపూర్వమైన స్థాయిలో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశారు. ఎన్నో కార్యక్రమాలను మహాసభల్లో ప్రదర్శిస్తున్నారు. జూన్ 30వ తేదీ నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. వెల్‌కం స్పీచ్‌తో నాటా కార్యక్రమాలను ఆరోజు ప్రారంభించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నాటా అవార్డులు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తున్నారు. ఈ మహాసభల్లో అందరినీ అలరించడానికి వీలుగా సంగీత దర్శకుల త్రయం కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అనూప్ రూబెన్స్, దేవిశ్రీ ప్రసాద్, ఎస్.ఎస్. థమన్ సంగీత విభావరులను ఈ మహాసభల్లో ఏర్పాటు చేశారు. తొలి రోజున అనూప్ రూబెన్స్ సంగీత కచేరీని ఏర్పాటు చేశారు.
ఎన్నో కార్యక్రమాలు
* నాటా మహాసభల్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రవణ్ కుమార్‌తో కన్నుల పండుగైన ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నారు. ఇంకా ప్రముఖ సినీ నృత్య దర్శకురాలు అనీ మాస్టర్ శిక్షణ పర్యవేక్షణలో స్థానిక పిల్లల జానపద, సినీ నృత్య ప్రదర్శనలను ప్రదర్శించనున్నారు.
* ఈ సంబరాన్ని అంబరానికి చేర్చడానికి, ప్రేక్షకులని అలరించడానికి ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నాటా మహాసభలకు వస్తున్నారు. సినీ నటీనటులు ఆలీ, లయ గోర్తి, పూజ ఝవాల్కర్, స్పందన పల్లి, అనసూయ, ఉదయ భాను, రవి, రోషన్, రవళి లాంటి ప్రముఖులు కూడా నాటా మహాసభలకు వస్తున్నారు. వారితో మీట్ అండ్ గ్రీట్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. కన్వెన్షన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మూడు రోజులు ముగ్గురు టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, థమన్, అనూప్ రూబెన్స్ తమ బృందాలతో చేసే సంగీత విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
* ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు రవిశంకర్‌ను ఆహ్వానించింది నాటా కార్యవర్గం. గురు రవిశంకర్‌తో ప్రత్యేకంగా ముచ్చటించే అవకాశాన్ని ప్రవాసాంధ్రులకు కల్పించింది.
* నాటా మహాసభల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే మహిళలకోసం ప్రత్యేక కార్యక్రమాలు, బిజినెస్ కమ్యూనిటీకోసం ప్రత్యేక కార్యక్రమాలు, కళాశాల నాటి విద్యార్థులకోసం అలూమ్ని సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ మహాసభల్లో చోటుచేసుకున్నాయి.
* నాటా అధ్యక్షుడు డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ హరి వేల్కూర్, పూర్వాధ్యక్షుడు డాక్టర్ గోసాల రాఘవ రెడ్డి, సెక్రటరీ గండ్ర నారాయణ రెడ్డి మొదలుగా గల ఎగ్జిక్యూటివ్ కమిటీ, మహా సభల కన్వీనర్ - ఎన్‌ఎంఎస్ రెడ్డి, సమన్వయకర్త డాక్టర్ బూచిపూడి రామిరెడ్డి, కో -కన్వీనర్ కోడూరు కృష్ణా రెడ్డి,కో-కో ఆర్డినేటర్ గండికోట భాస్కర్ రెడ్డి, డిప్యూటీ కన్వీనర్ క్రిష్టపాటి రమన్ రెడ్డి, డిప్యూటీ కోర్డినేటర్ ఆవుల మల్లిక్, బోర్డు అఫ్ డైరెక్టర్స్ జయచంద్రా రెడ్డి, పాముదుర్తి పవన్, పుట్లూర్ రమణ, అరిమండ రవీంద్ర, బత్తుల విష్ణు, ఆదిత్య రెడ్డి, కొరివి చెన్నా, వైశ్యరాజు మధుమతి, చొప్ప ప్రసాద్, పోలు రాజేంద్ర, వేముల వీరా రెడ్డి సభలు విజయవంతం కావడానికి కృషిచేస్తున్నారు. నాటా మహాసభల విజయవంతానికి వివిధ చోట్ల నిర్వహించిన ఫండ్ రైజింగ్ ఈవెంట్‌లకు మంచి స్పందన వచ్చింది. అంతేకాకుండా నాటా మహాసభలను పురస్కరించుకుని నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో ఎంతోమంది పాల్గొన్నారు.
అతిపెద్దదైన డల్లాస్ కన్వెన్షన్
డల్లాస్ నగరం నడిబొడ్డున అతిపెద్దదైన కన్వెన్షన్ సెంటర్‌గా పేరు పొందిన కే బైలీ హచిన్సన్ సెంటర్ (డల్లాస్ కన్వెన్షన్ సెంటర్)లో దాదాపు 10000 మందికి పైగా కూర్చొని కార్యక్రమాలను తిలకించవచ్చు. వచ్చినవారికి వసతి సౌకర్యాలు, అందరికి అందుబాటులో ఉండే లొకేషన్‌తో చక్కటి పార్కింగ్ సదుపాయం ఉన్న ఈ కన్వెన్షన్ సెంటర్‌లో వేడుకలు చూసేందుకు చాలామంది తరలివస్తారు. పది లక్షల స్క్వేర్ ఫీట్ ఎగ్జిబిట్ స్పేస్, మూడు భారీ బాల్‌రూంలు, 88 మీటింగ్ రూంలు, ఒక భారీ థియేటర్ డాలస్ కన్వెన్షన్ సెంటర్ ప్రత్యేకతలు. 1957లో నిర్మించిన ఈ కన్వెన్షన్‌ను అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వచ్చారు. 2013లో అమెరికా మాజీ సెనెటర్ కె. బెయిలీ పేరును ఈ కన్వెన్షన్ సెంటర్‌కు పెట్టారు.
డాలస్ కన్వెన్షన్ సెంటర్ డౌన్ టౌన్‌లో ఉండడం వల్ల సులువుగా చేరుకోవచ్చు. ఈ కన్వెన్షన్‌లో భారీ పార్కింగ్ సెంటర్‌లున్నాయి. అన్నీ రకాల పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌తో అనుసంధానం అయి ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అనుగుణంగా ఆమ్‌ట్రాక్, ట్రినిటీ రైల్వేలకు సమీపంలో ఉంది ఈ కన్వెన్షన్ సెంటర్. అలాగే కన్వెన్షన్‌తో నేరుగా స్కైవే బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ అయ్యేలా రెండు హోటళ్లు హయత్ రీజెన్సీ, షెరటాన్ హోటల్ ఉన్నాయి.