ASBL Koncept Ambience

అందరూ మెచ్చేలా నాటా కాన్ఫరెన్స్‌ కార్యక్రమాలు : నాటా అధ్యక్షుడు శ్రీధర్‌ రెడ్డి కొర్సపాటి

అందరూ మెచ్చేలా నాటా కాన్ఫరెన్స్‌ కార్యక్రమాలు : నాటా అధ్యక్షుడు శ్రీధర్‌ రెడ్డి కొర్సపాటి

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) డల్లాస్‌ నగరంలో జూన్‌ 30 నుండి జూలై 2వ తేది వరకు డల్లాస్‌లోని కే బైలీ హచిన్సన్‌ సెంటర్‌లో మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభలకోసం అతిరధ మహారధులైన  తెలుగు సినీ, రాజకీయ, సాంస్కృతిక, జానపద కళాకారులు, క్రీడాకారులు, వ్యాపార వేత్తలు, సంగీత ప్రముఖులు తరలి వస్తున్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నాటా మహాసభల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.  మహాసభల సందర్భంగా నాటా అధ్యక్షుడు శ్రీధర్‌ రెడ్డి కొర్సపాటిని ‘తెలుగు టైమ్స్‌’ పలకరించినప్పుడు ఆయన చెప్పిన విషయాలు....

నాటా మహాసభల్లో ముఖ్యమైన కార్యక్రమాలేమిటి?

ఈసారి డల్లాస్‌లో నిర్వహిస్తున్న నాటా మహాసభల కార్యక్రమాలను అందరూ మెచ్చే విధంగా ఏర్పాట్లు చేశాము. కార్యక్రమాల్లో ముఖ్యమైనది ముగ్గురు ప్రముఖ సంగీత దర్శకుల సంగీత విభావరులను ఒకే వేదికపై చూసేలా ఏర్పాటు చేశాము. టాలీవుడ్‌ అగ్ర సంగీత దర్శకులు  దేవిశ్రీ ప్రసాద్‌, థమన్‌, అనూప్‌ రూబెన్స్‌ తమ బృందాలతో చేసే సంగీత విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రవణ్‌ కుమార్‌తో కన్నులపండుగైన ఫ్యాషన్‌ షో నిర్వహిస్తున్నారు. ఇంకా ప్రముఖ సినీ నృత్య దర్శకురాలు అనీ మాస్టర్‌ శిక్షణ పర్యవేక్షణలో స్థానిక పిల్లల జానపద, సినీ నృత్య ప్రదర్శనలను ప్రదర్శించనున్నారు. నాటా అందాల పోటీలను కూడా నిర్వహిస్తున్నాము. టీన్‌, మిస్‌, మిసెస్‌ నాటా 2023 పేరుతో ఈ పోటీలను వివిధ నగరాల్లో నిర్వహించి ఫైనల్స్‌ పోటీలను మహాసభల వేదికపై జరపనున్నాము. నాటా ఐడల్‌ పేరుతో పాటల పోటీలను కూడా ఏర్పాటు చేసి అన్ని చోట్లా నిర్వహించి ఫైనల్స్‌ పోటీలను మహాసభల వేదికపై నిర్వహిస్తున్నాము. దీంతోపాటు స్థానిక కళాకారులు, ఇతరులతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ మహాసభల్లో ఏర్పాటు చేయడం జరిగింది.

మహాసభలకు ఎవరెవరూ వస్తున్నారు?

మహాసభలకు రావాల్సిందిగా పలువురు రాజకీయ నాయకులను, సినీ, సంగీత, నేపథ్య గాయనీ గాయకులను ఆహ్వానించాము. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, టీటీడి చైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి, తెలంగాణ మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్‌, పార్లమెంట్‌ సభ్యులు, డిఫెన్స్‌ సెక్రటరీ డాక్టర్‌ జి. సతీశ్‌ రెడ్డి తదితరులను ఆహ్వానించాము. 

సినీరంగం నుంచి హీరోయిన్‌లు తమన్నా భాటియా, లయ, స్పందన పల్లి, రవళి, ప్రియాంక ఝవల్కర్‌, అనసూయతోపాటు రామ్‌ గోపాల్‌ వర్మ, అలీ, మధుర శ్రీధర్‌ రెడ్డి, అనంత శ్రీరాం, శ్రీనివాస రెడ్డి తదితరులను ఆహ్వానించాము. 

సాహిత్యరంగం నుంచి నరాల రామిరెడ్డి, డా. ఆకేళ్ళ బాలభాను, బ్రహ్మశ్రీ డాక్టర్‌ రామడుగు నరసింహాచార్యులు, బాలాంత్రపు వెంకట రమణ, బలభద్రపాత్రుని రమణి, డాక్టర్‌ కందిమళ్ల సాంబశివరావు, వాడ్రేవు సుందర్రావు, డాక్టర్‌ మీగడ రామలింగస్వామి, మాట్ల తిరుపతి, మడిశెట్టి గోపాల్‌ తదితరులను ఆహ్వానించాము.
ఆధ్యాత్మిక రంగం నుంచి ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అధినేత, గురు శ్రీశ్రీ రవిశంకర్‌ వస్తున్నారు. 

వీరితోపాటు అమెరికా ప్రముఖులతోపాటు బిజినెస్‌ ప్రముఖులను కూడా ఈ మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించాము. 

నాటా మహాసభల కోసం ఏర్పాటు చేసిన కమిటీల వివరాలేమిటి?

నాటా మహాసభల నిర్వహణ కోసం ముందుగానే కమిటీలను ఏర్పాటు చేశాము. దాదాపు 43 కమిటీలను ఏర్పాటు చేశాము. ఆయా కమిటీలు తమకు అప్పగించిన బాధ్యతలను చేపట్టడంతోపాటు మహాసభలను విజయవంతమయ్యేందుకు అందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకుని పనిచేస్తున్నాయి. ఈ కమిటీల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అవసరమైన సూచనలు, సలహాలను ఇచ్చేందుకు నేషనల్‌ కమిటీతోపాటు కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ తదితరులను నియమించడం జరిగింది. 

తెలుగుటైమ్స్‌ ద్వారా మీరు ఇచ్చే సందేశమేమిటి?

డల్లాస్‌లో జరిగే కాన్ఫరెన్స్‌కు మీరంతా కుటుంబ సమేతంగా వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. తెలుగువారంతా కలిసే వేదికా ఉన్నందువల్ల, ప్రపంచ నలుమూలల నుంచి మహాసభలకు వస్తున్న ఎంతోమందిని స్వయంగా కలిసే అవకాశం ఉన్నందువల్ల అందరినీ ఈ మహాసభలకు రావాల్సిందిగా మహాసభల కమిటీల తరపున కోరుతున్నాము.

 

 

Tags :