గుంటూరు జిల్లాలో నాటా నాయకుల పర్యటన
ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) నాయకులు సేవాడేస్ కార్యక్రమాల్లో భాగంగా మాతృరాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తమ పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ఉన్న అనాథ శరణాలయాన్ని నాటా నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా నాటా అధ్యక్షులు రాఘవరెడ్డి గోసల మాట్లాడుతూ, అనాధ పిల్లలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఆప్ట్ చైల్డ్‌హోమ్ వ్యవస్థాపకులు గాత్రం వెంకాయమ్య, రాఘవులు చేస్తున్న సేవ ఎంతో అభినందనీయమని, ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు. పట్టణంలోని సుందరయ్య కాలనీలో నిర్వహించబడుతున్న హోమ్‌ను ఆయన సందర్శించి అక్కడ ఉన్న ఇబ్బందుల గురించి వాకబు చేశారు. పిల్లల చదువులకు, సంక్షేమానికి, ఆశ్రమ నిర్వాహణకు తమవంతుగా రూ.2 లక్షల ఆర్థిక సాయంను అందజేశారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా వుంటానని ఆశ్రమ నిర్వాహకులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో నాటా నాయకులు శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాసరెడ్డి, ఆళ్ళ రామిరెడ్డి, గండ్ర నారాయణరెడ్డి పాల్గొన్నారు.