ASBL Koncept Ambience

వైజాగ్‌లో అద్భుతంగా జరిగిన నాటా ‘సాంస్కృతిక జానపద కళా శోభ’

వైజాగ్‌లో అద్భుతంగా జరిగిన నాటా ‘సాంస్కృతిక జానపద కళా శోభ’

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆంధ్ర విశ్వ విద్యాలయం సహకారంతో విశాఖపట్నం డాబా గార్డెన్స్‌లోని అల్లూరి సీతా రామరాజు విజ్ఞాన కేంద్రం(ఏవీకే)లో ఏర్పాటు చేసిన ‘సాంస్కృతిక జానపద కళా శోభ’ అంగరంగవైభవంగా జరిగింది. ఆ వేదిక శాస్త్రీయ, జానపద కళారూపాల అరుద్కెన కలయిక. ‘నాటా సేవా దినోత్సవాలు`2022’ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో నిర్వహించే పలు సేవా కార్యక్రమాలలో భాగంగా విశాఖలో తొలిసారిగా ‘సాంస్కృతిక జానపద కళాశోభ’ పేరిట నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షక జనరంజకంగా సాగింది. ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాల రీత్యా తెలుగు నేలకు వేల కిలోమీటర్ల దూరంలో ఉండే తామంతా సంఘటితమై తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు మొక్కవోని దీక్షతో పనిచేస్తూ ఏడాది పొడుగునా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నాటా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ సుధారాణి కొండపు తన ప్రారంభోపన్యాసంలో వివరించారు. సేవా డేస్‌`2022 లో భాగంగా తెలుగు నేల నలు చెరగులా మౌలిక అవసరాలను లోతుగా అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా ప్రాధాన్యత క్రమంలో ఒక్కో అవసరాన్నీ తీర్చేపనికి శ్రీకారం చుట్టామన్నారు.

‘సాంస్కృతిక వికాసమే నాటా మాట-సమాజ సేవయే నాటా బాట’ అనే నినాదమే స్ఫూర్తిగా నాటా సేవా దినోత్సవాలు నిర్వహిస్తున్నట్టు నాటా అధ్యక్షులు శ్రీధర్‌ కొర్శపాటి వెల్లడించారు. విశాఖ/అల్లూరి జిల్లా ఏజెన్సీ పాడేరు, అరకులోయ పరిసర ప్రాంతాలలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కోటి రూపాయల వ్యయంతో 23 చోట్ల రక్షిత తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆళ్లరామిరెడ్డి చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి  ప్రాంతాలకు చెందిన వివిధ రంగాల నిష్ణాతులను ఎంపిక చేసి ‘నాటా సేవా పురస్కారాలు`2022’ అందజేశారు. ముత్తుస్వామి దీక్షితార్‌ విరచిత ‘మహా గణపతిం...’ సంకీర్తన ఆలాపనతో ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌ సంగీత విభాగం విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృతిక సంబరాలకు శ్రీకారం చుట్టారు. చైతన్య సోదరులు (శ్రీమాన్‌ వేంకటేశ్వర శర్మ - శ్రీమాన్‌ కృష్ణమాచార్యులు) వారి శిష్యబృందం 58 మందితో పాడిన అన్నమయ్య సంకీర్తనలు చక్కటి సమన్వయంతో ఆలపించి ఆహూతుల ప్రశంసలందుకున్నారు.

కౌండిన్య కూచిపూడి నాట్యం, ఏయూ సంగీత, నృత్య విభాగాల వారి కూచిపూడి మరియు జానపద గీతాలు, జాలరి నృత్యం, థింసానృత్యం, కోలాటం, రేలా రే రేల ఫేం జానకిరావు జానపద గీతాలు, రవి బృందం జానపద నృత్యాలు వీక్షకుల్ని ఉర్రూతలూగించాయి. నీలబోను సత్యం బృందం తప్పెటగుళ్లు  ఒళ్లు గగుర్పొడిచే సాము గరిడీలు ఉత్కంఠ రేపాయి. చిన్నరెడ్డి బృందం ప్రదర్శించిన రైతు జీవితం కంటతడిపెట్టించింది. రావులపాలెంకు చెందిన రాజేశ్వరీ సిస్టర్స్‌ బుర్రకథ ప్రత్యేకత సంతరించుకుంది.  జానపద కళాకారులకు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు  500 మందికి పైగా  ప్రేక్షకులకు విందు భోజనం అందించారు. 
‘నాటా’ సేవా దినోత్సవ పురస్కార గ్రహీతలు వీరే..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహా విశాఖ నగర మేయర్‌ శ్రీమతి జి. హరి వెంకట కుమారి, విశిష్ఠ అతిథులుగా నాబార్డు చైర్మన్‌ శ్రీ కె.కె. రాజు, ఏపీ పంచాయితీరాజ్‌ ఛాంబర్‌ చైర్మన్‌ శ్రీ మామిడి అప్పల నాయుడు,   నాటా అధ్యక్షులు శ్రీధర్‌ కొర్సపాటి, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆళ్ల రామి రెడ్డి, కార్యదర్శి నారాయణ రెడ్డి గండ్ర, బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు  రాధాకృష్ణ కల్వాయి, వెంకటరామిరెడ్డి శనివారపు, సుధారాణి కొండపు, నాటా సేవాడేస్‌ సమన్వయకర్త పార్థసారథి రెడ్డి, ఏయూ సంగీత,నృత్య విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఎ.అనూరాధ తదితరుల చేతులమీదుగా ఉత్తరాంధ్ర జిల్లాలకు  చెందిన 16 మంది నిష్ణాతులకు ‘నాటా కళా మరియు సేవా పురస్కారాల ప్రదానం జరిగింది. 

1. విజయ్‌ కుమార్‌ (చిత్రకళ),
2. బాదంగీర్‌ సాయి(నాటకరంగం),
3. జానకిరావు(జానపద గాయకుడు),
4. బి.ఎస్‌. రెడ్డి (మహేంద్రజాలం),
5. శ్రీనివాస్‌ సీరపు(జానపదం),
6. మథర్‌ ఎర్త్‌ ఎన్విరాన్‌మెంటల్‌ కాన్షియస్‌నెస్‌ సొసైటీ(మీకాన్స్‌) ,
7. వీఎన్‌మూర్తి( లేటు ) (స్నేహాంజలి ఆర్ట్స్‌ అకాడెమీ),  
8. కేఎస్‌ఎన్‌ మూర్తి, ప్రమీల దంపతులకు (విద్యారంగం), 
9. వీవీ పూర్ణచంద్ర రావు(భక్తి, సేవారంగం), 10- సతీష్‌ కుమార్‌ ఎం.(కాగితపుశిల్పి), 
11. రఘుపాత్రుని శ్రీకాంత్‌ (కూచిపూడి నృత్యం),
12. చిన్నరెడ్డి(జానపదం), 
13. కరాటే కల్యాణి (హరికథ), 
14. పారుపల్లి సత్యనారాయణ (సంగీత విభాగం), 
15. నీలబోను సత్యం (తప్పెటగుళ్లు) 
16. కళ్యాణ చక్రవర్తి (వేస్ట్‌ మెటీరియల్‌ కళాఖండాలు)  

తదితరులు ఈ పురస్కారాలందుకున్నారు. వైభవోపేతంగా కన్నుల పండుగగా సంప్రదాయం ఉట్టిపడే రీతిలో ఉత్సాహపూరితమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిలకించిన ప్రేక్షకులు ఆనందాన్ని వ్యక్తం చేసి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన నాటా టీమ్‌ను, సుధారాణి కొండపును అభినందించారు. 

 

Click here for Photogallery

 

 

Tags :