నటోమాస్ గ్రూప్ ఆధ్వర్యంలో 11 వ వార్షికోత్సవ బతుకమ్మ మరియు దసరా సంబరాలు
మన తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో బతుకమ్మ పండుగ నిర్వహించాలంటే అమెరికా వంటి దేశంలో ఒకవిధంగా అసాధ్యమే. ఖండాంతరం లో వున్నా మన సంస్కృతి, సంప్రదాయం పరిరక్షించాలనే తపన, తాపత్రయం మెండుగా వున్న, మన శాక్రమెంటో లోని నటోమాస్ గ్రూప్ ఆధ్వర్యంలో అది సుసాధ్యమైనది. అక్టోబర్ 6 న, 11 వ వార్షికోత్సవ బతుకమ్మ మరియు దసరా సంబరాలు, అందరినీ అబ్బురపరిచే విధంగా అలరించాయి. దాదాపు 1000 మంది ఈ మహా ఉత్సవంలో పాల్గొన్నారు. తెలుగుతనం ఉట్టిపడే విధంగా సంప్రదాయ దుస్తులలో అందరూ స్వచ్చందంగా పాల్గొనిన విధానమును చూస్తే తెలుగుతనమంతా నటోమాస్ లోనే కొలువుతీరిందని అనిపించింది.
సర్వమానవ సౌఖ్యం కోసం మనం బతుకమ్మ జరుపుకుందాం అని 11 సంవత్సరాల క్రితం అనుకొన్న ఒక చిన్న సంకల్పం, నేడు ఒక ఊరులో జరుపుకునే ఉత్సవంగా మారి ఈ సంవత్సరం పెద్ద ఫంక్షన్ హాల్ లో అత్యంత ఘనంగా జరిగిందంటే అందుకు కారణభూతులైన సభ్యుల నిభద్దత, పట్టుదల, నిరుపమానమైనది.
వేదపండితులు గౌరమ్మను పూజించిన తరువాత 9 రకాల రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మను పూజించి తరువాత ఓలలాడించారు. అందరూ ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఆద్యంతము పాల్గొని, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ రాగయుక్తంగా పాడుతూ చేసిన నృత్యాలు ఎంతో కనులపండుగగా వుండినది. ఈ పవిత్ర కార్యక్రమం ద్వారా ఆ దేవి అనుగ్రహమును పొందడమే కాకుండా మన సాంప్రదాయాల మీదున్న గౌరవాన్ని, నమ్మకాన్ని మరొక్కసారి మనః పూర్వకముగా నిరూపించారు. తరువాత జరిగిన అన్నదాన కార్యక్రమము మన సొంతవూరిలోని పండుగ వాతావరణాన్ని తలపించినది.
భోజనానంతరము జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యతం ఒకే ఉత్సాహం, ఉల్లాసంతో కొనసాగి అందరినీ అలరించాయి. ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ జానపద గాయకుడు డాక్టర్ శ్రీనివాస్ లింగా తనదైన బాణిలో, పాటల ఒరవడిలో శ్రోతలను అలరించారు. స్థానికంగా వున్నా చిట్టి, చిన్నారుల నృత్యవిన్యాసాలు నిజంగా ఎంతో ఆహ్లాదాన్ని కలిగించాయి.
ఈ బతుకమ్మ వేడుకలకు ప్రధాన కర్తలైన శ్రీ వెంకట్ మేచినేని మాట్లాడుతూ, తమ తోటి స్నేహితులు, ఆప్తుల అండదండలు మరియు సేవాదీక్షలు ఈరోజు ఇంత ఘనంగా జరుపుకోనుటకు దోహదపడ్డాయని సెలవిచ్చారు. ఈ కార్యక్రమము ద్వారా ఎంతో ఆనందాన్ని, అనుభూతులను, మధురస్మృతులను పొందామని, అందరు సుఖ సంతోషాలతో జీవించాలని అందుకు దేవతల అనుగ్రహము ఉంటుందని నమ్ముతూ, ఈ కార్యక్రమము ఇంత దిగ్విజయముగా జరిగేందుకు సహకరించిన దాతలకు, పాల్గొనిన అందరికీ కృతజ్ఞతలు అని సెలవిచ్చారు.