ASBL Koncept Ambience

ఘనంగా ముగిసిన నాట్స్ తెలుగు సంబరాలు

ఘనంగా ముగిసిన నాట్స్ తెలుగు సంబరాలు

*** సందడి చేసిన తెలుగు సినీ,కళా ప్రముఖులు ***

*** సంబరాల వేదికపై తెలుగు ప్రముఖులకు సత్కారాలు *** 

అమెరికాలో తెలుగుజాతిని ఒక్కటి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన 5 వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను ఘనంగా నిర్వహించింది. చికాగోలోని షాంబర్గ్ వేదికగా జరిగిన ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులు విచ్చేశారు. తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా.. తెలుగువారిని ఉత్తేజ పరిచేలా ఈ సంబరాలు జరిగాయి మూడు రోజుల పాటు జరిగిన ఈ సంబరాలు ఆద్యంతం తెలుగువారికి అంతులేని సంతోషాలు పంచాయి.

ఈ మూడు రోజుల సంబరాలలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, రాజకీయ వేత్తలు, వ్యాపార వేత్తలు, విద్యావేత్తలు,  సినీ ప్రముఖులు, ప్రముఖ క్రీడాకారులు, సాహిత్య, సంగీత కళాకారులు విచ్చేసారు.

రుద్ర శంకరం, అన్నమాచార్య కీర్తనలు, సౌండ్ ఆఫ్ ఇషా, వెంకటాచల నిలయం, బాల రామయణం లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ వచ్చి వారిని భక్త ప్రవాహంలో ఓలలాడించాయి. సంబరాల వేదికపై బతుకమ్మ ఆడి ఏ దేశమేగినా జన్మభూమిని మరువమంటూ ప్రవాసులు చాటారు. కూచిపూడి, కథక్ లాంటి సంప్రదాయ నృత్యాలు కూడా ప్రవాసుల్లో భారతీయ కళల పట్ల ఉన్న మక్కువ ఏ పాటిదో చూపించాయి. అమెరికాలో ఏడేళ్ల తెలుగు బాలుడు ఆకాశ్ ఊకోటి  తో స్పెల్ బీ పై నిర్వహించిన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. కచ్చపి కళాపీఠం వారు "భువన విజయం" పద్య నాటకం ప్రదర్శించారు. తటవర్తి కల్యాణ చక్రవర్తి రాసిన ఆధునిక చిత్రణ తో కూడిన ఈ  "భువనవిజయం" పలువురిని ఆకట్టుకొంది.  భూమి నే నమ్ముకున్న రైతు, తల్లి , మనవడి మధ్య సంఘర్షణ పై "మనలోని మనిషి" నాటిక బాగా ఆకట్టు కొన్నాయి.  మున్ముందు నాట్స్ ఇలాంటి మరిన్ని నాటిక, నాటకాలకు స్ఫూర్తి గా నిలిచింది. 

ఇక తెలుగు సినీ తారల సందడి  కూడా అమెరికాలో తెలుగువారికి మధురానుభూతులు పంచాయి. ప్రముఖ సినీ హీరో లు అల్లు అర్జున్, నిఖిల్ , సాయికుమార్, అలీ, సుబ్బరాజు తో పాటు పూజ హెగ్డే మరెందరో తారలు, తారామణులు, బుల్లి తెర నటీ నటులు సంబరాల్లో సందడి చేశారు. రేవంత్ మ్యూజికల్ నైట్ లో తెలుగువారిలో ఫుల్ జోష్ నింపింది. గాయనీ సునీత, వందేమాతరం శ్రీనివాస్ లు పాడిన పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. జబర్థస్త్ టీమ్  సంబరాల్లో నవ్వులు పువ్వులు పూయించింది.

ప్రముఖులు, మానవతా వాదులకు సత్కారాలు: 

అనేక రంగాల్లో రాణిస్తూ తెలుగుజాతికి ఆణిముత్యాలనే పేరు తెచ్చుకుంటున్న వారిని నాట్స్ సంబరాల వేదికపై సన్మానించింది. ప్రముఖ రచయిత, రాజ్య సభ సభ్యుడు,  సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత, పద్మ భూషణ్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తో పాటు మధ్య ప్రదేశ్ లోని, ఇండోర్ కలెక్టర్ గా పనిచేసి అద్భుత పనితీరుతో రాష్ట్రపతి పురస్కారాలు అందుకున్న పరికిపండ్ల నరహరి ని నాట్స్ సన్మానించింది. మానవతా వాది సేవాతత్పరుడు సుధాకర్ కొర్రపాటి, కమ్యూనిటీ సేవలకు గుర్తింపుగా దాము గేదెల, Rx అడ్వాన్స్ కార్య నిర్వహణ అధికారి & వ్యవస్థాపకులు శ్రీ రవి ఐక. (వీరు హెల్త్ కేర్ ఇండస్ట్రీ కి సరికొత్త ప్రయోగాత్మక , సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆవిష్కరణలు చేసి ప్రవేశ పెట్టారు.) లను నాట్స్ సన్మానించుకుంది.

అమెరికాలో ఎనిమిదేళ్ల తెలుగు బాలుడు ఆకాశ్ ఊకోటి  గత సంవత్సరం స్పెల్ బీ పై నిర్వహించిన పోటీ లలో ప్రధమ స్థానం లో  గెలిచిన అతి చిన్న వయసు వాడు కావటం తో నాట్స్ ఆకాష్ ను సంబరాలకు పిలిచింది. సాయి కుమార్ సమక్షం లో జరిగిన పరిచయ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. ఆకాశ్ ప్రతిభను చూసిన ఆశ్చర్యచకితులైన సభికులందరూ తమ కరతాళధ్వనులతో ఆ బుడతడి కి అభినందనలు తెలిపారు. తెలుగు కవులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ఆకాశ్ ఊకోటి ని ధారణ వామనుడు గా అభివర్ణించారు. ఇదే వేదికపై జొన్నవిత్తుల ప్రతిపాదించగా  నాట్స్ ఆకాశ్ ఊకోటి కి "ధారణ వామన"  బిరుదును పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిబొట్ల ఆనంద్, మండలి బుద్ధ ప్రసాద్, జొన్నవిత్తుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. 

నాట్స్ చైర్మన్ సామ్ మద్దాళి, నాట్స్ ప్రెసిడెంట్ మోహనకృష్ణ మన్నవ, సంబరాల కన్వీనర్ రవి ఆచంట మరియు సంబరాల వాలంటీర్ లను ప్రత్యేకంగా అభినందిస్తూ , ఈ రకమైన సంబరాలు తెలుగు వారిలో సేవా , స్నేహం, కళల పట్ల  అభిమానం పెంపొందుతాయని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా వేలాదిగా తెలుగు వారు ఈ నాట్స్ సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ మూడు రోజుల తెలుగు సంబరాల్లో బావర్చి వారి భోజన ఏర్పాట్లను అందరూ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త,  బావర్చి చైన్ అధినేత  కిషోర్ కంచర్ల ను నాట్స్ సన్మానించింది.

తదుపరి నాట్స్ సంబరాలు 2019 లో సియాటెల్ లోనూ, 2021 సంబరాలు న్యూ జెర్సీ లోనూ జరగనున్నాయని నాట్స్ చైర్మన్ సామ్ మద్దాళి ప్రకటించారు. ఎప్పటి లాగే ఈ రాబోయే  నాట్స్ సంబరాలలో పాల్గొనాలని అందరికీ పిలుపు నిచ్చారు.

రేవంత్, సునీత, వందేమాతరం శ్రీనివాస్, సాయికుమార్ తదితరులు గానం చేసిన " పుణ్య భూమి నా దేశం నమో నమామి" పాట తో , అనంతరం రావు ఆచంట వందన సమర్పణ తో సంబరాలు ముగిసాయి.

 

Click here for Event Gallery

Tags :