అమెరికాలో వైభవంగా ముగిసిన తెలుగు సంబరాలు
కీరవాణి సంగీతం.. తమన్నా మెరుపులు..
తెలుగు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆట పాటలతో హోరెత్తిన ఇర్వింగ్
అమెరికాలో నాట్స్ అంగరంగ వైభవంగా జరిపే అమెరికా తెలుగు సంబరాలు రెండోరోజు కూడా ఎంతో ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే సంబరాల సందడి మొదలైంది. ఇర్వింగ్ వేదికగా జరుగుతున్న ఈ సంబరాల్లో రెండో రోజు గరుడగమన శ్రీనివాస కళ్యాణం పేరుతో చేసిన శాస్త్రీయ నృత్యం సంప్రదాయ వాదులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మనబడి చిన్నారుల చేసిన అష్టావధానం రూపకం ఔరా తెలుగు పిడుగులు అనిపించింది. సంబరాలకు విచ్చేసిన వారిని ఉత్సాహంతో చిందేసేలా చేసేందుకు మాస్ మెడ్లీ రంగంలోకి దిగి తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్లు వేశారు. వేయించారు. అందమైన భామలతో డ్యాన్స్ మెడ్లీ చేసిన డ్యాన్స్ మేజిక్ కూడా ఆకట్టుకుంది.
గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ చేసిన అడవితల్లి గిరిజన నృత్యానికి మంచి స్పందన లభించింది. ఇక ఆ తర్వాత డ్యాన్స్ మెడ్లీ డ్యాన్స్ వారియర్స్ పేరుతో మరోసారి సినిమా పాటలకు డ్యాన్స్ లు చేయించారు. హ్యూస్టన్ చాప్టర్ రూపొందించిన నృత్య కార్యక్రమానికి కూడా మంచి స్పందన వచ్చింది. సంప్రదాయ భారతీయ వస్త్రాలు ధరించి.. ప్రత్యేక అలంకరణలతో సాగిన తెలుగోత్సవం కార్యక్రమం కూడా విశేషంగా ఆకర్షించింది. ఆ తర్వాత కూచిపూడి నృత్యం.. సంప్రదాయ నృత్య ప్రేమికులను కట్టిపడేసింది.
తెలుగుపాటల మిక్స్ చేసిన టాలీవుడ్ టీజర్ డ్యాన్స్ కు అద్భుతమైన స్పందన లభించింది.దేశభక్తిని ప్రతిబింబిస్తూ... ప్రియభారతీ జననీ అని చేసిన నృత్యానికి అందరూ జైహింద్ అంటూ అభినందనలు తెలిపారు. సరదాగా మరదలిపిల్లను ఆటపట్టిస్తూ.. గళ్లు.. గళ్లు.. చప్పుళ్లు.. అంటూ సాగిన జానపద నృత్యం మన గిరిజన సంస్కృతిని గుర్తు చేసింది. .. రాజే.. కింకరుడగును.... కింకరుడే.. రాజగున్... అంటూ ఆ సత్య హరిశ్చంద్ర చెప్పిన జీవన సత్యాలను తెలగు సినీ గాయకుడు ప్రవీణ్ అద్భుతంగా ఆలపించారు. ఆ తర్వాత మా వాణి.. బాణి.. అంటూ గేయరచయితలు.. గాయకులు కలిసి చేసిన జుగల్ బందీ కూడా అందరిని విశేషంగా ఆకట్టుకుంది. ఓ చినదాన అంటూ రాయలసీమ జానపదగీతానికి చేసిన నృత్యం.. రాయలసీమ సంస్కృతిని ప్రతిబింబించింది. ఈశా గీరిశా.. అంటూ ఆ పరమశివుడిని స్తుతిస్తూ చేసిన నృత్యం కూడా విశేషంగా ఆకట్టుకుంది. అడవిచుక్కలు పేరుతో చేసిన గిరిజన నృత్యానికి మంచి స్పందన లభించింది. స్థానిక తెలుగువారిలో ప్రతిభను ప్రోత్సాహిస్తూ.. వారిలో సంగీత పాటవాన్ని వెలికితీస్తూ చేసిన కార్యక్రమం... స్వరవర్షిణికి విశేషంగా స్పందన లభించింది.
రైతు రాజ్యమే.. రామరాజ్యం అనేది చాటిచెబుతూ.. రైతుల జీవితాలపై అన్నదాత సుఖీభవ అంటూ చేసిన నృత్యరూపకం విశేషంగా ఆకట్టుకుంది. సంగీత నవవేదం పేరిట మీగడ రామలింగ స్వామి చేసిన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. తెలుగు బ్రూసిలి.. వివేక్ చిరుపల్లి చేసిన స్కిట్, జబర్ధస్ట్ ఆర్టిస్టులతో చేసిన కామెడీ ప్రోగ్రామ్ నవ్వులు పువ్వులు పూయించింది.
ఉదయం నాట్స్ బోర్డు మరియు కార్యవర్గ కమిటీ ల మీటింగ్ లు జరిగాయి. రెండో రోజు సాయంత్రం పురస్కారాల ప్రదానం జరిగింది. షార్ట్ ఫిల్మ్ విభాగంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తెలుగు హీరోయిన్ డ్యాన్స్ అందరిని అలరించింది. నీవు పెద్దపులి అంటూ చేసి జానపదనృత్యం.. అందరిని చిందులు వేయించింది. ఆ తర్వాత రప్తార్ హంగామా.. అందరిలో హుషారు నింపింది. పాప్ సింగర్ స్మిత వల్లూరుపల్లి, మిస్ టీన్ యూ.ఎస్ 2019 ఈషా కోడె లతో వుమెన్ ఫోరమ్ నారీ భేరి 2019, అటలు, డొమెస్టిక్ వయొలెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ ఫర్ విమెన్ అండ్ గర్ల్స్, షేర్ యువర్ ప్యాషన్ విత్ సర్ప్రైజ్ సెలెబ్రిటీ వంటి కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
జననీ జన్మభూమి.. అంటూ చేసిన నృత్యం భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చేసింది. ఆ తర్వాత సంబరాలకు వచ్చిన తారలకు సత్కారం జరిగింది. టాలీవుడ్ టాప్ స్టార్ తమన్న స్టేజ్ మీదకు రావడం.. మాట్లాడటం.. ఇవన్నీ సంబరాల్లో యూత్ మంచి కిక్ఇచ్చాయి. ఆ తర్వాత సేవా పురస్కారాలను అందించారు. ఇక సంబరాలకు అసలు సిసలైన ముగింపుత్సోవం కీరవాణి సంగీత విభావరి అందరిని అలరించింది. తెలుగు సినీ పాటల ప్రవాహంలో సంబరాలకు వచ్చిన ప్రతివారు తడిసి ముద్దయ్యేలా చేసింది. హోరెత్తే సినీ పాటలకు అందరూ కలిసి చిందేశారు. సంబరాల సంతోషంలో మునిగితేలారు. దాదాపు 8 వేల మందికి పైగా ఈ సంబరాల సంతోషంలో పాలుపంచుకున్నారు.. వచ్చే తెలుగు సంబరాలు 2021లో న్యూజెర్సీ వేదికగా జరగనున్నాయని నాట్స్ సంబరాల వేదికగా బోర్డు సభ్యుడు మరియు కన్వెన్షన్ సెలక్షన్కమిటీ చైర్ కొత్త శేఖరం ప్రకటించారు.