అమెరికా తెలుగు సంబరాల్లో అవార్డుల ప్రదానోత్సవం
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో డల్లాస్‌లో అమెరికా తెలుగు సంబరాలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలుత వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన ప్రముఖులకు అవార్డులను అందజేశారు. 'మనమంతా తెలుగు–మనసంతా వెలుగు' అనే నినాదంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
డల్లాస్‌లోని ఇర్వింగ్ ప్రాంత మేయర్ రిక్ స్తోఫర్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ ప్రవసాంద్ర వైద్యుడు డా. ముక్కామల అప్పారావుతో పాటు మరికొందరు ప్రముఖులు ఈ కార్యక్రమంలో అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా రూపొందించిన ప్రత్యేక సంచికను నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ ఆవిష్కరించారు. నాట్స్ సంబరాల కమిటీ చైర్మన్ కంచర్ల కిషోర్ అతిథులకు స్వాగతం పలికారు. నాట్స్ ట్రస్టు బోర్డు చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్, సంఘం అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస్ నాట్స్ చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు.
అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులను అమితంగా అలరించింది. రాజ్యసభ మాజీ సభ్యులు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సినీ నటుడు సాయికుమార్, రచయితలు రామజోగయ్య శాస్త్రి, సిరాశ్రీ, భాస్కరభట్ల, రాజేష్, నటీమణులు మన్నారా చోప్రా, భానుశ్రీ, ప్రియ, నీలిమా భవానీ, గీతా, మిమిక్రీ కళాకారులు శివారెడ్డి, జితేంద్ర, గిరిధర్, జెమినీ సురేష్, సంగీత దర్శకులు కీరవాణి, మనో, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాంప్రదాయబద్దమైన విందు బ్యాంక్వేట్‌తో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.