ముగిసిన నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో టెక్సాస్ రాష్ట్ర ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటరులో శుక్రవారం నుండి ప్రారంభమయిన మూడు రోజుల 6వ అమెరికా తెలుగు సంబరాలు కీరవాణి సంగీత విభావరితో ముగిశాయి. యాపిల్ మాజీ సీఈఓ, ఆర్‌ఎక్స్ అడ్వాన్స్, డైరక్టర్ల బోర్డు సభ్యుడు జాన్ స్కూలీ ఈ ముగింపు వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆపిల్ మాజీ సిఇఓ మాట్లాడుతూ, తెలుగువారు అమెరికా అభివద్ధికి శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారా ఎంతో చేయూతను ఇస్తున్నారని, తమ సంస్థలోనే తాను సీఈఓగా బాధ్యతలు నిర్వహించినప్పుడు ఎంతో మంది తెలుగువారు విశేష సేవలందించారని కొనియాడారు. నాట్స్ వేడుకల్లో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని, చిన్నారుల నత్యాలు తనను కట్టిపడేశాయని అన్నారు. అనంతరం ఆయనను సంస్థసిఇఓ ఐకా రవిలను సినీ నటి తమన్నా, నాట్స్ బోర్డ్ చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస బాబు, సభల చైర్మన్ కంచర్ల కిషోర్, కార్యవర్గ సభ్యులు అప్పసాని శ్రీధర్, దేశు గంగాధర్, ఆలపాటి రవి, డా.కొడాలి శ్రీనివాస్, పిన్నమనేని ప్రశాంత్, మన్నవ మోహనకష్ణ తదితరులు ఘనంగా సత్కరించారు.
ఈ సంబరాల విజయవంతానికి విశేష కషి చేసిన నాట్స్ చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ దంపతులను నాట్స్ కార్యవర్గం ప్రత్యేకంగా అభినందించి సన్మానించింది. సాయికుమార్ వ్యాఖ్యానంలో కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. జెమిని సురేష్, గిరిధర్‌ల హాస్య నాటిక నవ్వించింది. సినీ సంగీత దర్శక బాహుబలి కీరవాణి సంగీత విభావరి అతిథులను మైమరిపించింది. 2021లో 7వ అమెరికా తెలుగు సంబరాలను న్యూజెర్సీలో నిర్వహిస్తామని గుత్తికొండ శ్రీనివాస్ ప్రకటించారు.