విభిన్న కార్యక్రమాలు.. నాట్స్ తెలుగు సంబరాల ప్రత్యేకం
తెలుగు టైమ్స్ ఇంటర్వ్యూలో నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి నూతి
అమెరికాలో జాతీయ తెలుగు సంఘాల్లో ఒకటిగా పేరు పొందిన నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్)కు ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా ఉన్న నూతి బాపయ్య చౌదరి (బాపు) కమ్యూనిటీకి ఎల్లప్పుడూ సేవ సహాయ కార్యక్రమాలను అందిస్తూనే మరోవైపు ప్రొఫెషనల్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన నూతి బాపయ్య చౌదరి దిగువ మధ్య తరగతి రైతు కుటుంబం నుంచి వచ్చారు. నాగార్జున యూనివర్సిటీలో యంయస్‌సి మ్యాథమేటిక్స్‌లో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులై కొద్దీ నెలలపాటు పిఏ యస్ కళాశాలలో గణిత లెక్చరర్‌గా పని చేసి, అదే సమయంలో కంప్యూటర్ సైన్స్‌లో ప్రావీణ్యం సంపాదించి మలేషియాలో రెండున్నర సంవత్సరం పాటు ఉద్యోగం చేశారు. తరువాత అమెరికా వెళ్లి కంప్యూటర్ విభాగాల్లో ఉద్యోగిగా స్థిరపడి అంచెలంచెలుగా ఎదిగారు. సీనియర్ ఐటీ కన్సల్టెంట్‌గా, సీనియర్ టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఓవైపు ఐటీలో ప్రావీణ్యం సంపాదిస్తూనే మరోవైపు సొసైటీలో కూడా సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రముఖ వ్యక్తిగా గుర్తింపును పొందారు.
నాట్స్ అధ్యక్షుడిగా..
భాషే రమ్యం...సేవే గమ్యం అన్న నినాదంతో తెలుగువారికి సేవ చేస్తున్న నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) జాతీయ తెలుగు సంఘాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. నాట్స్‌కు అధ్యక్షుడిగా బాపయ్య చౌదరి నూతి బాధ్యతలను చేపట్టిన తరువాత ఎన్నో సేవా కార్యక్రమాలు అమెరికాలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్వహించారు. నాట్స్‌తో ఆయన అనుబంధం సుదీర్ఘమైనది. నాట్స్ సంస్థలో క్రియాశీలక సభ్యునిగా చేరి పట్టుదలతో సేవా కార్యక్రమాలను చేసి నాట్స్ సభ్యుల అభిమానాన్ని చూరగొన్నారు. విద్యార్థులకు నాట్స్ తరపున స్కాలర్ షిప్‌లను తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహిం చారు. అలాగే నేత్ర వైద్య శిబిరాలను నిర్వహించి అవసరమైన వారికి తన ఖర్చుతో ఆపరేషన్‌లను చేయించారు. సేవా కార్యక్రమాలతో పాటు అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నాట్స్ తెలుగు సంబరాలకు ఎంతో ఆదరణ ఉంది. ఎంతోమంది కళాకారులను ఈ వేడుకలకు పిలిపించి సత్కరిస్తూ కళా ప్రదర్శన లతో తెలుగువారిని మైమరపింపజేస్తుం టుంది.
నాట్స్ 7వ అమెరికా తెలుగు సంబరాలను మే 26 నుంచి 28వ తేదీ వరకు న్యూజెర్సిలోని న్యూ జెర్సి కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పొజిషన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నేపథ్యంలో నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరితో తెలుగు ట్కెమ్స్ చేసిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు
తెలుగు సంబరాల్లో ప్రత్యేక కార్యక్రమాలను వివరిస్తారా?
నాట్స్ 3 రోజుల సంబరాల వేడుకల్లో అందరినీ అలరించేటలా 3 సంగీత విభావరులను ఏర్పాటు చేశాము. ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ, థమన్‌ల సంగీత విభావరులతోపాటు ఎలిజియం బ్యాండ్ వారి సంగీత కచేరీ కూడా ఉంది. సంబరాలకు వచ్చేవారికి ఈ కార్యక్రమాలకు స్పెషల్‌గా ఎంటర్ టైన్ మెంట్ అందించేలా ఉంటాయి. మే 27వ తేదీన మ్యూజికల్ ఎక్స్‌ట్రావగంజా పేరుతో మణిశర్మి సంగీత విభావరి జరగనున్నది. మే 28వ తేదీన థమన్ థండర్ పేరుతో ఎస్‌ఎస్ థమన్ సంగీత విభావరి జరగనున్నది. ఎలిజియం బ్యాండ్ పేరుతో సంగీత కచేరి మే 26వ తేదీన జరగనున్నది. ఈ మూడు కార్యక్రమాలు అందరినీ అలరించేలా ఉంటుందని ఆశిస్తున్నాము.
మొదటిసారిగా అమ్మ, నాన్నకు సత్కారం అని ఇక్కడ ఉన్న ఎన్‌ఆర్‌ఐల తల్లితండ్రులను సత్కరించే విన్నూత్న కార్యక్రమం ఇది. ఇప్పటికే అందరి దగ్గర నుంచి అభినందనలు వస్తున్నాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ అంటారు. మనల్ని కనిపెంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తల్లితండ్రులను గౌరవించడం మన బాధ్యత... ఆ గౌరవించడం తెలుగువాళ్ళందరూ కలిసి చేసుకునే సంబరాల వేదికపై ఎంత బాగుంటుందో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇప్పటికే ఈ కార్యక్రమం ఏర్పాటుపై అభినందనలు వస్తున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి జానపద కళాకారులను తీసుకువచ్చి నాట్స్ సంబరాల స్టేజీ మీద పరిచయం చేయడం ఒక ప్రత్యేక ఆకర్షణగా కూడా ఉంటుంది.
శతజయంతి కార్యక్రమాల గురించి..
ప్రపంచంలోని తెలుగువారి ఆరాధ్యద్కెవం, మహానటుడు ఎన్టీరామారావు శతజయంతి వేడుకలను నేడు ప్రపంచమంతా చేస్తున్నారు. మే 28న ఆయన 100వ పుట్టిన రోజును చేసుకుంటున్నారు. ఆ రోజునే నాట్స్ సంబరాలు జరగడం, సంబరాలలో భాగంగా ఎన్‌టీఆర్ జయంతి వేడుక జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సందర్భంగా ఆ మహానీయుని స్మరించుకుని కార్యక్రమాలను ఏర్పాటు చేశాము. అలాగే ఈ సంవత్సర కాలంలో మరణించిన కళాతపస్వీ కే. విశ్వనాథ్, సూపర్‌స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, హీరోయిన్ జమున, నవరస నటనాసార్వభౌమ కైకాల సత్యనారాయణలను స్మరించు కుంటూ ప్రత్యేక క్యార్యక్రమాలను నాట్స్ సంబరాల్లో ఏర్పాటు చేశాము. హాస్యనటుడు కీ.శే అల్లుగారి శత జయంతి వేడుకలను కూడా నాట్స్ సంబరాల్లో జరుపుతున్నాము. ఆయన కుమారుడు అల్లు అరవింద్ సంబరాలకు వస్తున్నారు.
ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చెప్పండి?
నాట్స్ సంబరాలకు వెన్యూ, తేదీలు ఖరారయ్యాక పనులను మొదలు పెట్టాము. దాదాపు 400 నుంచి 500 మంది వలంటీర్లు, 35 కమిటీలతో 2 నెలల నుంచి కాన్ఫరెన్స్‌కు అవసరమైన ప్రణాళికలు, పనులను చేస్తున్నాము. ఈ సంబరాల ద్వారా వచ్చిన నిధుల్లో 20 శాతం అయినా సేవా కార్యక్రమాలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాలన్నది మా ఆశయం. ఆందుకు తగ్గట్లుగా ప్రయత్నాలు చేస్తున్నాము. కోవిడ్ తరువాత నిర్వహిస్తున్న పెద్ద కార్యక్రమం ఇది. మా కార్యక్రమాలు అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాము. దాంతోపాటు ఈ సంబరాలు జరుగుతున్న ప్రాంతం అన్నీ నగరాలకు దగ్గరగా ఉంటుంది కాబట్టి తెలుగువాళ్ళు పెద్ద సంఖ్యలో హాజరవుతారని ఆశిస్తున్నాము.
- చెన్నూరి వెంకట సుబ్బారావ్
ఎడిటర్ ` తెలుగుటైమ్స్
తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్‌లో పాల్గొనండి: బాపు నూతి
అమెరికాలోని తెలుగువాళ్ళకు మీడియాపరంగా 20 సంవత్సరాలుగా ‘తెలుగు టైమ్స్’ సేవ చేస్తున్నది. తెలుగు ఎన్నారైలు, తెలుగు అసోసియేషన్‌ల గురించి బాగా తెలిసిన తెలుగు టైమ్స్ ఇటీవల 20వ వార్షికోత్సవం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు టైమ్స్‌కు అభినందనలు. అలాగే తెలుగు టైమ్స్ ఇప్పుడు నిర్వహించనున్న బిజినెస్ అవార్డుల కార్యక్రమం కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. అందరూ ఈ బిజినెస్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాను.