వివిధ నగరాల్లో ఎన్డీఏ కూటమి విజయోత్సవ సంబరాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఎ కూటమి విజయం సాధించడంపై అమెరికాలో ఉంటున్న ఆ పార్టీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. వివిధ నగరాల్లో ఉన్న తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల అభిమానులు, నాయకులు ఈ సంబరాల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తమ మద్దతును తెలియజేశారు. అమెరికా నుంచి దాదాపుగా 200 మంది ఎన్నారైలు ఆంధ్ర రాష్ట్రంవెళ్లి ప్రచార బాధ్యతలు చేపట్టి తమ పార్టీలను విజయపథంవైపు నడిపించారు. ఈ విజయోత్సవ సంబరాల్లో వీరంతా తాము ఎన్నికల ప్రచారంలో ఎదుర్కొన్న అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్నారై నాయకులను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. గుంటూరు ఎంపిగా గెలిచిన డా. చంద్ర పెమ్మసానిని, ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ కాకర్ల, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్‌కుమార్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రామును పలువురు అభినందిస్తూ ఎన్నారైలుగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి రాష్ట్రానికి సేవలందిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళి విజయాన్ని సాధించిన ఎన్నారైలు ఈ విజయోత్సవ సంబరాల్లో తమ సందేశాలను వినిపించారు.
ఎన్నారైలు తమ గెలుపుకోసం చేసిన కృషిని మరవలేమంటూ, వారు చేసిన సహాయం ఇంకా కొనసాగించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ప్రగతికి కృషి చేయాలని కోరారు. గుంటూరు ఏంపీ, కేంద్రమంత్రి డా. చంద్ర పెమ్మసాని, ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ కాకర్ల, తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఎన్నారై టీడిపి నాయకుడు జయరాం కోమటి, భాజపా శాసనసభ్యులు సుజనా చౌదరి మరియు జనసేన శాసనసభ్యురాలు శ్రీమతి లోకం మాధవి తదితరులు వీడియో సందేశాల ద్వారా ఎన్నారైలకు ధన్యవాదాలు తెలియజేశారు.
రాష్ట్రప్రగతిలో కూడా తమ భాగస్వామ్యం కొనసాగించి, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపేందుకు తమవంతుగా చేయూతనిస్తామని ఈ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎన్నారైలు నాయకులు తెలియజేశారు.