ASBL Koncept Ambience

అట్లాంటాలో ఘనంగా ఎన్డీఎ కూటమి విజయోత్సవం

అట్లాంటాలో ఘనంగా ఎన్డీఎ కూటమి విజయోత్సవం

ఆంధ్రప్రదేశ్‌  అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కూటమి (ఎన్డీఎ) విజయాన్ని సాధించడంపై అట్లాంటాలో ఉన్న అభిమానులంతా సంతోషం వ్యక్తం చేసి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.  తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బిజెపి అభిమానులు కలిసి ప్రజా విజయం పేరిట విజయగర్జన వేడుకలు నిర్వహించారు. జూన్‌ 22 శనివారం రోజున జార్జియా రాష్ట్రం, అట్లాంటాలోని జేడ్‌ బాంక్వెట్‌ హాల్లో ఈ విజయోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. సాయంత్రం 5 గంటల సమయంలో దాదాపు 500 కార్లతో డులూత్‌ రోడ్లలో అతి పెద్ద ర్యాలీ నిర్వహించారు. టీడీపీ, జనసేన మరియు బీజేపీ బ్యానర్లు, జండాలు, కండువాలతో నినాదాలు చేశారు. జై చంద్రబాబు, జై పవన్‌ కళ్యాణ్‌, జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ, జయహో కూటమి అంటూ హోరెత్తించారు. పోలీస్‌ సెక్యూరిటీ నడుమ కూటమి పార్టీల పాటలతో కొందరు కార్లపైకి ఎక్కి మరీ నినాదాలు చేశారు. తేనీటి విందు అనంతరం మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి డప్పులతో, తీన్మార్‌ డాన్సులతో వేదిక ప్రాంగణంలోకి ఊరేగింపుగా విచ్చేశారు. వేదిక ప్రాంగణం అంతా బ్యానర్లు, జండాలు, కండువాలతో పసుపు, ఎరుపు రంగుల మయమైంది. ఆహ్వానితులు సైతం పసుపు, ఎరుపు రంగుల వస్త్రాల్లో రావడం విశేషం. అందరూ ఆశీనులైన అనంతరం వ్యాఖ్యాతలు సురేష్‌ పెద్ది మరియు సురేష్‌ కరోతు అందరికీ స్వాగతం పలికారు. ఇండియా నుంచి విచ్చేసిన పెద్దలు, మహిళలతో జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రారంభించారు. ముందుగా ఎన్నారై టీడీపీ అట్లాంటా నాయకులు సతీష్‌ ముసునూరి స్వాగతోపన్యాసం చేశారు. 

ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యులు, టీడీపీ మరియు జనసేన లీడర్లు పంపిన పలు వీడియో సందేశాలను ప్రదర్శించారు. వీరందరూ ఎన్నికల సమయంలో ఎన్నారైలు చేసిన కృషిని అభినందించారు. మున్ముందు కూడా రాష్ట్ర అభివృద్హిలో పాలుపంచుకోవాలని కోరారు.

అనంతరం గాయకులు సందీప్‌ కూరపాటి పుణ్యభూమి నా దేశం అంటూ ఎన్టీఆర్‌  పాటతో మొదలుపెట్టి, టీడీపీ, జనసేన పార్టీల పాటలతో ఉర్రూతలూగించారు. చందు ప్రత్యేక డాన్స్‌ షో, రోబో గణేష్‌ రోబో తరహా డాన్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. తర్వాత కీ నోట్‌ స్పీకర్స్‌ మల్లిక్‌ మేదరమెట్ల, సురేష్‌ కరోతు, క్రిష్ణప్రియ తదితరులు ప్రసంగించారు. ఫుడ్‌ కోఆర్డినేటర్‌ వేణు దండా ఫుడ్‌ స్పాన్సర్స్‌ అందరినీ పేరు పేరునా అభినందించారు. మిమిక్రీ కళాకారులు రమేష్‌ తనదైన స్టైల్‌ లో పలువురు రాజకీయ నాయకులను మరియు సినీ రంగానికి చెందిన నటీనటులను అనుకరిస్తూ సభలో నవ్వులు పూయించారు. మధ్యలో పాటలు కూడా పాడుతూ అందరినీ అలరించారు. పసందైన విందు భోజనం అనంతరం బాణసంచా కాల్చారు. ముందే ఊహించి 2000 మందికి సరిపడా ఏర్పాట్లు చేశారు.  

ఈ మధ్యనే కాలం చెందిన మీడియా మొఘల్‌, అక్షరాన్నే ఆయుధంగా మార్చిన యోధుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్‌ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీ రావుకి నివాళులు అర్పిస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.

భోజనాల అనంతరం ఎన్నారై టీడీపీ అట్లాంటా, టీం అట్లాంటా జనసేన (Team Atlanta Janasena) నాయకుల నడుమ కూటమి కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచారు. తదనంతరం మరోసారి మిమిక్రీ రమేష్‌, రోబో గణేష్‌ తమ ప్రదర్శనతో అలరించారు. ఇక క్లైమాక్స్‌ లో గాయనీ గాయకులు శ్రీ ప్రజ్ఞ, సందీప్‌ కూరపాటి మరియు జనార్దన్‌ పన్నెల చక్కని పాటలతో సంగీత విభావరి నిర్వహించారు.

చివరిగా శ్యామ్‌ మల్లవరపు మరియు రాజు మందపాటి వందన సమర్పణ తెలిపి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.
 

 

Click here for Photogallery

 

 

Tags :