తానా నూతన అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగుసంఘం నూతన అధ్యక్షునిగా నిరంజన్ శృంగవరపు పదవీ బాధ్యతలు చేపట్టారు. తానా కన్వెన్షన్ సభావేదికపై ప్రస్తుత ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు సభాముఖంగా నిరంజన్ శృంగవరపును వేదికపైకి ఆహ్వానించి తానా అధ్యక్షునిగా తనకి ఈరోజు చివరిరోజని, రేపటి నుండి అనగా జులై 10 నుండి నిరంజన్ శృంగవరపు అధ్యక్షునిగా కొనసాగుతారని ప్రకటించారు. కుటుంబ సమేతంగా వేదిక పైకి విచ్చేసిన నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ.. ముందుగా తన తల్లితండ్రులను తలచుకున్నారు. తానా లీడర్ షిప్ అందరికీ, కన్వెన్షన్ కి విచ్చేసిన అతిరథమహారథులకు, అలాగే తనను తానా అధ్యక్షునిగా ఎన్నుకున్న తానా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది తన అదృష్టమని, అందరినీ కలుపుకొని పోతూ తానాని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తామన్నారు.
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ పరిధిలోని రాజానగరంకు చెందిన నిరంజన్ శృంగవరపు తానాలో అంచెలంచెలుగా ఎదిగారు. తానా ఫౌండేషన్ చైర్మన్‌గా ఉన్నప్పుడు కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఫౌండేషన్ ద్వారా ఎంతో సహాయాన్ని అందించారు. కోట్లాది రూపాయలతో మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా నిత్యావసరాలను, ఇతర సహాయాన్ని ఆయన ఫౌండేషన్ ద్వారా చేశారు. ఎంతోమందికి సేవలందించిన నిరంజన్ శృంగవరపు ప్రస్తుతం తానా అధ్యక్షునిగా మరిన్ని సేవా కార్యక్రమాలను, సహాయ కార్యక్రమాలను తానా తరపున నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.