తానా నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన నిరంజన్ శృంగవరపు
తానా 23వ మహాసభలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల చివరి రోజునే తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి పదవీకాలం ముగిసింది. ఈ క్రమంలో నూతన అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు ఇదే వేదికపై అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తానా వంటి సంస్థకు తనను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు తానా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అమెరికాలో తెలుగు వారి సేవ కోసం ఆవిర్భవించిన తానా.. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్య వికాసం కోసం అవిశ్రాంత కృషి చేస్తోందని నిరంజన్ అన్నారు. ఇలాంటి సంస్థకు అధ్యక్షునిగా సేవలందించే అవకాశం దక్కడన తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ‘ఏ లక్ష్యంతో తానా ఏర్పడిందో వాటిని సాధించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. అందర్నీ కలుపుకొని పోతూ, అందరితో కలిసి అమెరికాలోనే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు వారికి సేవ చేస్తాం. సంస్థాగతంగా తానాను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు’ అని నిరంజన్ పేర్కొన్నారు.