ఏ అంశంమీదనైనా చర్చకు నేను సిద్ధమే...మీరు వస్తారా?
న్యూజెర్సి మీటింగ్‍లో బహిరంగ సవాల్ విసిరిన నిరంజన్ శృంగవరపు
తానా ఎన్నికల ప్రచారంలో భాగంగా న్యూజెర్సిలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‍లో అధ్యక్ష అభ్యర్థి పదవికి పోటీ పడుతున్న నిరంజన్ శృంగవరపు తన వర్గంతో కలిసి నిర్వహించిన సమావేశానికి ఎంతోమంది హాజరై మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ, తనపై ఆరోపణలు చేసేవారికి ఈ వేదిక నుంచే సవాల్ విసురుతున్నానని, నేను చేసిన సేవ, అభివ•ద్ధి కార్యక్రమాలపైన గానీ, అందజేసిన విరాళాలకు సంబంధించిన విషయాలపైగాని ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని ప్రకటించారు. తాను తానాలో ఎన్నో కమిటీల్లో, పదవుల్లో పనిచేశానని, 2015 డిట్రాయిట్ కన్వెన్షన్‍కు తాను కోశాధికారిగా కూడా వ్యవహరించానని చెప్పారు. ఆ మహాసభలకు సంబంధించిన ప్రతి పైసా లెక్కను ఆరు నెలల్లో బోర్డుకు సమర్పించి వారి ఆమోదముద్ర కూడా వేయించుకున్నామని, రెండేళ్ల కిందట డీసీలో జరిగిన మహాసభలకు సంబంధించిన లెక్కలకు ఇప్పటికీ దిక్కులేదని అంటూ, దీనిపై అడిగితే ఇస్తాం, ఇస్తాం అంటూ 18నెలలుగా తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు.
ప్రస్తుత కోశాధికారి, మా ప్యానల్ నుంచి సెక్రటరీ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన సతీష్ వేమూరి దీనిపై ప్రశ్నలు అడిగితే దానికి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకపోవడం దారుణమన్నారు. తానా శాశ్వత భవన నిర్మాణ కమిటీకి ఉపాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా వ్యవహరించిన 18ఏళ్ల సేవకుడు ఇప్పటివరకు ఒక్క సమావేశాన్ని అయినా నిర్వహించారా? అని నిరంజన్ ప్రశ్నించారు. డీసీ మహాసభలకు నిధుల సేకరణ సమయంలో తానా భవనానికి ఆయా నిధులను ఖర్చు పెడతామని హామీ ఇచ్చారని వాటికి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారని ఆయన అడిగారు. అలసత్వానికి, ఆశ్రితపక్షపాతానికి విరుద్ధంగా పోటీ పడటం తద్వారా మరొకరికి అవకాశం కల్పించడమే తాము కోరుకునే మార్పు అని నిరంజన్ స్పష్టం చేశారు. మహిళలు, వైద్యులు, తదుపరి తరానికి చెందిన యువత కలబోసిన తమ ప్యానెల్ ముఖచిత్రమే మార్పుకి ప్రతిబింబం అని ఆయన పేర్కొన్నారు. మా ప్యానెల్ నుంచి ఎంతోమందికి అవకాశం కల్పించామని, దేశీ యువతకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తూ శశాంక్ యార్లగడ్డకు అవకాశం ఇచ్చామని చెప్పారు. తానా ఫౌండేషన్ చైర్మన్‍గా కోవిడ్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతోమందికి ఉపయోగపడ్డాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తదుపరి అధ్యక్షుడు అంజయ్య చౌదరి కూడా మాట్లాడారు. నిరంజన్ శృంగవరపు వర్గాన్ని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నిరంజన్ వర్గం తరపున కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్‍గా పోటీ పడుతున్న రాజా కసుకుర్తి ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమం విజయవంతానికి సహకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము గతంలో తానా ద్వారా చేసిన ప్రతి ఈవెంట్‍ను కమ్యూనిటికీ ఉపయోగపడేలా చేశామని, అలాగే వచ్చిన నిధులను సంక్షేమపనులకు ఉపయోగించామని చెప్పారు. న్యూయార్క్ క్రూయిజ్ ఈవెంట్ ద్వారా వచ్చిన 10000డాలర్ల విరాళాలను పోచంపల్లి చేనేత కార్మికులకు ఆసుయంత్రాల పంపిణీకి ఉపయోగించామని ఇలా ఎన్నో కార్యక్రమాలను కమ్యూనిటీ సంక్షేమానికే చేశామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. పలువురు అభ్యర్థులు కూడా తానా ద్వారా చేసిన సేవా కార్యక్రమాలను గుర్తు చేస్తూ, తమను గెలిపించాలని కోరారు.