తానా మహాసభల్లో టీడీపీ ఎన్నారైల వ్యూహం ఖరారు
ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో ఇటీవల జరిగిన ‘తానా’ 23వ సమావేశాల సందర్భంగా ఎన్నారై టీడీపీ యూఎస్‌ఏ సమావేశం జరిగింది. ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఎన్నారై టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ జయరాం కోమటి, ఎన్నారై టీడీపీ సెల్ డాక్టర్ రవి వేమూరి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు, జోన్-2 కోఆర్డినేటర్ రవి మందలపు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఎన్నారై టీడీపీ నేతలను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన సందేశంపై ఈ సమావేశంలో చర్చించారు. అమెరికాలో టీడీపీ ఎన్నారైలు చేపట్టవలసిన కార్యక్రమాల గురించి ఎన్నారై టీడీపీ కో ఆర్డినేటర్ జయరాం కోమటి వివరించారు.
అమెరికాలోని టీడీపీ ఎన్నారైలు పార్టీకి చేస్తున్నసేవ గురించి టీడీపీ రాజ్యసభ సభ్యుడు రవీంద్ర కనకమేడల కొనియాడారు. ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అందులో ఎన్నారైల పాత్ర గురించి ఎన్నారై టీడీపీ సెల్ డాక్టర్ రవి వేమూరి వివరించారు. రాబోయే రోజుల్లో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి చర్చించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు ఇచ్చి, వారు ఇచ్చిన విలువైన సలహాలను అమలు చేస్తామన్నారు. జోన్-2 కోఆర్డినేటర్ మందలపు రవి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎన్నారై టీడీపీ పాత్ర గురించి వివరించారు. సాయి బొల్లినేని ఈ సమావేశానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వెంకట్ ఆళ్ల, రావు రాళ్ళపల్లి, జానకిరామ భోగినేని, సూర్య బెజవాడ, బాలాజీ తాతినేని, వంశీ కోట, శ్రీధర్ అప్పసాని, రామకృష్ణ వాసిరెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.