బాబు పర్యటన నేపథ్యంలో జయరామ్ కోమటి అధ్యక్షతన మిల్‌పిటాస్‌లో సమావేశం
అమెరికాలో ఎన్నారై తెలుగు దేశం పార్టీ నాయకునిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనను విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకోసం చంద్రబాబు నాయుడు మే 4 నుంచి 10వ తేదీ వరకు అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాలోని యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అవార్డును కూడా ముఖ్యమంత్రి ఈ పర్యటనలోనే స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ఎపిలో పెట్టుబడులను పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి ఎన్నారై ప్రముఖులను, సిలికాన్‌వ్యాలీలోని సిఇఓలను కలిసి కోరనున్నారు. ముఖ్యమంత్రి కాలిఫోర్నియా పర్యటనను దృష్టిలో పెట్టుకుని జయరామ్ కోమటి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై అనుచరులతో, ఎన్నారై టీడిపి అభిమానులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పైలా ప్రసాద్, రామ్ తోట తదితరులు పాల్గొన్నారు.