కవిత గెలుపు కోసం ఎన్నారైల హోమం
నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ హనుమాన్ మందిరంలో నిజామాబాద్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత 5 లక్షలపై చీలుకు ఓట్లతో గెలవాలని కోరుకుంటూ ఎన్నారైలు హోమం నిర్వహించారు. లండన్, అమెరికా నుంచి వచ్చిన ఎన్నారైలు గత కొన్ని వారాలుగా నిజామాబాద్‌లో మకాం వేసి కవితకు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే సారంగాపూర్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ స్వాములతో కలిసి పూజలు, యజ్ఞలు చేసి కవితను భారీ విజయాన్ని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్‌ఎస్ సెక్రటరీ, అధికార ప్రతినిధి చాడ సృజన్‌రెడ్డి మాట్లాడుతూ కవిత నిజామాబాద్ ప్రజలకు చాలా సేవలు చేశారని, గల్ఫ్‌లో చిక్కుకుపోయిన ఎంతో మంది తెలంగాణ బిడ్డలను కాపాడి ఇంటికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎన్నారైలకు పెద్దదిక్కుగా ఉన్న కవితకు ఎన్నారైలు అందరు రుణపడి ఉంటారని, అందుకే తాము అందరం కవిత విజయం కోసం ప్రచారం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నిజామాబాద్ యూత్ నాయకులు పబ్బసాయి, ఆలయ సిబ్బందికి, పూజారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ యజ్ఞంలో రమేష్, ఇస్సంపల్లి సుమన్, బాలమూరి, రోహిత్ రెడ్డి, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.