తానా వేదికపై ఎన్టీఆర్ అవార్డు అందుకున్న మురళీ మోహన్
తానా 23వ మహాసభలు చివరి రోజు కూడా వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు సంస్కృతికి చేసిన సేవకుగాను తానా అందించే తానా-ఎన్టీఆర్ అవార్డును శ్రీ మాగంటి మురళీ మోహన్‌కు అందిస్తున్నట్లు తానా ప్రతినిధులు తెలిపారు. ఐదు దశాబ్దాలపాటు ఆయన తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు చేసిన సేవకు గుర్తుగా ఈ అవార్డు అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ అవార్డును ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా మురళీ మోహన్ అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘మనందరి అభిమాన నేత, నటులు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ శుభసందర్భంలో.. ఆయన పేరు మీద ఉన్న అవార్డును నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పారు. అలాగే ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నాడని, బసవతారకం కేన్సర్ ఆస్పత్రిని ఇంత అభివృద్ధి చేయడంలో బాలకృష్ణ ఎంతో కృషి చేశారని తెలిపారు. తానా ఎంతో సేవ చేసిందని, ఇలాంటి కార్యక్రమాలను తానా మరెన్నో చేయాలని ఆశించారు.