వాషింగ్టన్ లో ఘనంగా ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాలు
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల్ని ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు. అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మసహాసభలు డీసీలో ఈ నెల 1 నుంచి మూడో తేదీవరకు ఘనంగా జరిగాయి. మూడో రోజు ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల్ని అట్టహాసంగా నిర్వహించారు. ఆయన సినీ, రాజకీయ ప్రస్థానానికి అద్దం పట్టేలా ఒక నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. వంద ఏళ్ల పండుగకు వందనాలు అందుకో వందల తమరులకైనా అందరు ఆనందమొందు సుందర గంభీర రూపమా అంటూ ఎన్టీఆర్ గొప్పతనాన్ని కీర్తిస్తూ పలువురు యువతులు శాస్త్రీయ నృత్యాభినయంతో ఆయనకు నీరాజనాలు పట్టడంతో నృత్య రూపకం మొదలైంది.
వేదికపై ఏర్పాటు చేసిన భారీ తెరపై ఎన్టీఆర్ వివిధ సినిమాల్లో పోషించిన పాత్రల చిత్రాలు ప్రదర్శితమవుతుండగా ఆ కళాకారిణులు చేసిన నృత్యం ఆహూతుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మరో గీతానికి కళాకారిణులు నృత్యం చేస్తుండగానే ఎన్టీఆర్ ధరించిన పలు పాత్రల వేషదారణల్లో ఒక్కొక్కరుగా వేదికపైకి వచ్చారు. గుండమ్మ కథలో ఎన్టీఆర్ వేషధారణలో, బృహన్నల, భీష్ముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శివుడు వంటి పౌరాణిక పాత్రలో, కొండ వీటి సింహం తదితర సాంఘిక సినిమాల్లో ఎన్టీఆర్ ధరించిన వేషదారణాలతో ప్రవాసాంధ్రులు వేదికపైకి వచ్చి హావభావాలతో మెప్పించారు.