ఘనంగా తెలుగుపోటీల విజేతలకు బహుమతుల ప్రదానం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం 22వ మహాసభలను పురస్కరించుకుని పాఠశాల-తానా కలిసి వివిధ నగరాల్లో ఉన్న చిన్నారులకు తెలుగు భాషపై తెలుగు పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. వివిధ నగరాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచినవారికి వాషింగ్టన్ డీసీలో జరిగిన 22వ మహాసభల్లో సెమిఫైనల్, ఫైనల్ పోటీలను నిర్వహించారు. ఫైనల్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల వ్యవస్థాపక చైర్మన్ జయరామ్ కోమటి, పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు, ముఖ్య అతిధులుగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జయరామ్ కోమటి మాట్లాడుతూ, పాఠశాలను లాభాపేక్షతో నడపడం లేదని, తెలుగు భాషను అంతరించిపోకుండా నేటితరానికి కూడా నేర్పించాలన్న తపనతోనే పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. పాఠశాల నిర్వహణ, ఏర్పాట్లు అంతా సుబ్బారావే చేస్తున్నారని, ఇప్పుడు ఆయన కుటుంబం కూడా పాఠశాల నిర్వహణలో పూర్తిగా పాలుపంచుకుంటోందని అభినందించారు.
సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, పాఠశాలను ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు అయినప్పటికీ రెండు సంవత్సరాలు బాలారిష్టాలను ఎదుర్కొందని చెప్పారు. గత మూడేళ్ళ నుంచే పాఠశాలకు గుర్తింపు వచ్చిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల ఎన్నారై పిల్లలకు చేస్తున్న సేవలను గమనించి పాఠశాలకు ప్రత్యేక గుర్తింపును ఇవ్వడంతోపాటు పాఠశాల ద్వారా ఎన్నారై పిల్లలకోసం ప్రత్యేక సిలబస్‌ను రూపొందించి అమలు చేస్తోందని చెప్పారు. పాఠశాలకు మాత్రమే ఇలాంటి గుర్తింపు లభించిందని అన్నారు. పాఠశాలలో రెండేళ్ళ కోర్సు, నాలుగేళ్ళ కోర్సును పూర్తి చేసిన చిన్నారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖవారు సర్టిఫికెట్లను ఇస్తున్నారని కూడా తెలిపారు.
ముఖ్య అతిధిగా వచ్చిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, గతంలో అమెరికాకు వచ్చిన కొత్తలో తెలుగుభాషను మాట్లాడేవారు తక్కువ. మా ఇంట్లోనే మా అబ్బాయి పిల్లలు మాట్లాడే భాష మాకు అర్థమయ్యేది కాదు. దాంతో నా భార్య ఇక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదని, కాని పరిస్థితులు మారాయి. తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషను మాట్లాడేవారు తక్కువయ్యారు. అమెరికాలో తెలుగు భాషను పరిరక్షించుకునేవారు ఎక్కువయ్యారు. దాంతో ఇక్కడే తెలుగు భాషకు మర్యాద లభిస్తోంది. పాఠశాల కూడా తెలుగు భాష బోధనలో విశేష కృషి చేస్తోందని ప్రశంసించారు.
మరో అతిధి గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ, తెలుగుభాషలో మాత్రమే పద్యం ఉందని, ఈ పద్యాన్ని పాఠశాల పిల్లలకు నేర్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గతంలోనే ప్రకటించానని చెప్పారు. ఇప్పుడు కూడా పాఠశాల వారు అనుమతిస్తే పిల్లలకు పద్యం నేర్పిస్తానని తెలిపారు.
బాటా అడ్వయిజర్ విజయ ఆసూరి మాట్లాడుతూ, బే ఏరియాలో పాఠశాల విజయవంతంగా నడుస్తోందని చెప్పారు. పాఠశాలకు తల్లితండ్రులే వలంటీర్లుగా ఉంటూ సేవలందించేవారని, తరువాత వారే టీచర్లుగా కూడా మారి పిల్లలకు తెలుగు భాషను శ్రద్ధగా నేర్పిస్తున్నారని తెలిపారు. తరువాత ఫైనల్ పోటీల్లో విజేతలకు బహుమతులను అతిధులు అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని కో ఆర్డినేట్ చేయడంతోపాటు, మొదటినుంచి పాఠశాల తెలుగు పోటీలకు అవసరమైన ఏర్పాట్లను శ్వేతారావు చెన్నూరి చేశారు.
ఈ కార్యక్రమంలో ఫిలడెల్ఫియా ఏరియా డైౖరెక్టర్ నాగరాజు నలజుల, మేరీలాండ్ ఏరియా డైరెక్టర్ దేశాయి సిద్దాబత్తుల, ఫిలడెల్పియా నుంచి టీచర్ పద్మాలక్ష్మీ, వర్జీనియా టీచర్ శ్రావ్య బయ్యనతో పాటు, బాల్టిమోర్ నుంచి టీచర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.