బాటాలో అలరించిన 'పల్నాటి భారతం'
బే ఏరియాలో తెలుగు కమ్యూనిటీకి విభిన్న కార్యక్రమాలతో అలరిస్తున్న బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఈ సంవత్సరం కూడా ఉగాది వేడుకల్లో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో 'పల్నాటి భారతం' పేరుతో చారిత్రక సాంఘిక నాటకాన్ని ప్రదర్శించి అందరినీ మరోమారు ఆకట్టుకుంది.
దాదాపు 500 పైగా నాటకాలు వేసిన, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్న రవి కుమార్ నరాలశెట్టి అనే స్టేజి ఆర్టిస్ట్ బే ఏరియాలో ఉండటం తో ఆయనను బే ఏరియా తెలుగు వారికి పరిచయం చేయాలని బాటా నాయకత్వం భావించింది. అందులో భాగంగా రవి కుమార్ దర్శకత్వం లో '' పల్నాటి భారతం'' అనే హిస్టారికల్ నాటకం వేద్దామని నిర్ణయించుకొని అందుకు తగ్గట్టుగా కార్యక్రమం ప్రారంభానికి 10 రోజుల ముందే పాత్రధారులను ఎంపిక చేసుకుని రిహార్సల్ చేసింది. ఈ నాటకంలో బ్రహ్మ నాయుడుగా రవికుమార్ నరాలశెట్టి నటించగా, మలిదేవ మహా రాజు గా చెన్నూరి వెంకట సుబ్బారావు, కొమ్మ రాజుగా ప్రసాద్ మంగిన, ఆలా రాజుగా కళ్యాణ్ కట్టమూరి, చక్రవర్తి కన్నమదాసుగా, చిరంజీవి మాధవ్ బాలచంద్రుడు గా ఈ నాటకంలో పాత్రలను ధరించారు. అనుకున్నట్లుగానే ఈ నాటకం అందరి ప్రశంసలను అందుకుంది. కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది.
తెలుగు టైమ్స్ ఎడిటర్‌గా ఉన్న చెన్నూరి సుబ్బారావు పత్రిక పనిమీద అమెరికాలో ఉన్నారు. బే ఏరియా తెలుగు అసోసియేషన్ ఉగాది వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన 'పల్నాటి భారతం' నాటకంలో మలిదేవ మహారాజుగా చెన్నూరి సుబ్బారావు నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు.
బాలచంద్రుడుగా నటించిన మాధవ్ కూడా పలువురి మన్ననలను అందుకున్నారు. కళ్యాణ కట్టమూరి, ప్రసాద్ మంగిన తదితరులు కూడా తమ పాత్రలను అద్భుతంగా పోషించి నాటకాన్ని రక్తికట్టించారు.