భారత్, అమెరికా దేశాల బంధం మరింత బలోపేతం -ప్రధాని మోదీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో భారత్, అమెరికా దేశాల బంధం మరింత బలోపేతం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇరుదేశాల మధ్య వ్యాపార భాగస్వామ్యం మరింత పటిష్టమవ్వాలని, ఇరుదేశాల వాణిజ్య బంధానికి ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా మోదీ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. కొవిడ్-19పై పోరాటం సహా విస్త ృత ప్రాధాన్యతా అంశాలపై శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్ లో సుమారు గంటపాటు చర్చించారు. పర్యావరణ పరిరక్షణ, ఉగ్రవాద ముప్పు నివారణ, అఫ్గానిస్థాన్ పరిణామాలు, ఇండో`పిసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం సహా ఆర్థిక, రక్షణ సంబంధ వ్యవహారాల్లో పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలని, స్నేహాన్ని మరిన్ని కొత్త రంగాలకు విస్తరించుకోవాలని ఈ చర్చల్లో నిర్ణయించారు. బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇద్దరు నేతలు ముఖాముఖీ కలుసుకోవడం ఇదే ప్రథమం. ఇప్పటి వరకు ఫోన్ ద్వారా సంభాషించుకున్నారు. వర్చువల్ సమావేశాల ద్వారా మాత్రమే కలుసుకున్నారు. 2014, 2016లలో వీరు కలుసుకున్నప్పటికీ అప్పుడు బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
శ్వేతసౌధంలో మోదీకి స్వాగతం పలుకుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు అత్యుంత దృఢంగా సన్నిహితంగా ఉండడం నిర్ణయాత్మకమని బైడెన్ అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని ప్రస్తావిస్తూ బాపూజీ అహింస, సహనం, శాంతి సందేశాలు ప్రపంచానికి గతంలో కన్నానేడెంతో అవసరమని పేర్కొన్నారు. ప్రపంచ సవాళ్లకు భారత్-అమెరికా బంధం పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. సాదర స్వాగతానికి మోదీ కృతజ్ఞతలు చెబుతూ 2014, 2016లలోనూ మీతో మాట్లాడే అవకాశం లభించింది. భారత్, అమెరికా సంబంధాలపై మీ దార్శకతను అప్పుడు వెల్లడిరచారు. దీనిని సాకారం చేసేందుకు మీ నేతృత్వంలోని కృషిని కొనసాగించడం హర్షణీయమని అన్నారు. వాణిజ్యం, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారం రెండు దేశాల స్నేహ సంబంధాల్లో కీలక భూమిక వహించనుందని తెలిపారు.
అగ్రనేతలిద్దరి భేటీలో ఇరు దేశాల ఉన్నతాధికారులతో పాటు భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, కార్యదర్శి శ్రింగ్లా, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోభాల్, అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు తదితరులు పాల్గొన్నారు.
భారత్‌లో బైడెన్ బంధువులు
భారత దేశంలో ఇంటి పేర్లతో అనుబంధాలు ముడిపెట్టుకోవడంపై బైడెన్ సరదాగా మాట్లాడారు. 1972లో సెనెటర్‌గా తాను తొలిసారి ఎన్నికైనప్పుడు ముంబయి నుంచి ఓ వ్యక్తి లేఖ రాస్తూ తన ఇంటి పేరు బైడెన్ అని పేర్కొన్నారని గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యక్షుడి హోదాలో ముంబయి వచ్చినప్పుడు కొందరు విలేకరులు ఇదే విషయంపై తనను అడిగారని చెబుతూ ఆ మరుసటి రోజే భారత్‌లో అయిదుగురు బైడెన్లు ఉన్నారని పత్రికలు రాశాయని తెలిపారు. అయితే వారి గురించి తానెపుడూ ఆరా తీయలేదన్నారు. బహుశా ఇవ్వాళ్టి సమావేశం అందుకు ఏమైనా ఉపయోగపడుతుందేమోనంటూ చమత్కరించారు. దీనికి సంబంధించిన తాను పత్రాలను తీసుకొచ్చినట్లు తెలిపిన మోదీ వారు మీ బంధువులే అని తెలిపినప్పుడు హాలులో నవ్వులు విరిశాయి.