ASBL Koncept Ambience

మాటలు కాదు.. ఇక చేతలు కావాలి : మోదీ

మాటలు కాదు.. ఇక చేతలు కావాలి : మోదీ

వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావాలను అరికట్టేందుకు ఇప్పటివరకు చాలా మాటలు చెప్పామని, ఇక మాటలు కట్టిపెట్టి చేతలు ప్రారంభించాల్సిన సమయం అసన్నమైందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి వేదికగా సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్‌ నేతృత్వంలో వాతావరణ మార్పుపై జరిగిన శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. పారిస్‌ ఒప్పందం అమలుపై కార్యచరణను వేగవంతం చేసే లక్ష్యంతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. వివిధ దేశాలు వాతావరణ మార్పు ప్రమాదాన్ని అరికట్టే దిశగా కృషి చేస్తున్నాయిగానీ ఇప్పుడు ఒక సమగ్ర కార్యచరణ, అంతర్జాతీయ స్థాయి ఉద్యమం అవసరమని తన ప్రసంగంలో మోదీ పేర్కొన్నారు. మనల్ని ముందుకు నడిపించాల్సింది అవసరమే కానీ అత్యాశ కాదు అని ప్రపంచదేశాలకు హితవు పలికారు. ఇందుకు విద్య నుంచి విలువల వరకు వ్యక్తిగత స్థాయిలో మార్పునకు అంతా శ్రీకారం చుట్టాలన్నారు.

ఈ సదస్సులో భారత్‌ తరపున ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. భారతదేశ శిలాజేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని 2022 నాటికి భారీగా 450 గిగావాట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రకృతిని గౌరవించడం, వనరులను జాగ్రత్తగా వాడుకోవడం, మన అవసరాలను కుదించుకోవడం.. మొదలైన చర్యలు చేపట్టాల్సిన ఉందన్నారు. ఆచరణ సాధ్యమైన ఒక ప్రణాళిక అవసరాన్ని నొక్కి చెప్పేందుకు భారత్‌ ఈ సదస్సులో పాల్గొంటోందని సృష్టం చేశారు. భారత్‌లో బయో ప్యూయల్‌ను పెట్రోల్‌, డీజిల్‌లలో కలిపే కార్యక్రమం ప్రారంభించామన్నారు. నీటి సంరక్షణ, వర్షం నీటిని సంరక్షించుకోవడం లక్ష్యంగా ప్రారంభించిన జల్‌ జీవన్‌ మిషన్‌ పథకంపై రానున్న కొన్ని ఏళ్లలో 50 బిలియన్‌ డాలర్లు (రూ.3.5 లక్షల కోట్లు) ఖర్చు పెట్టనున్నామన్నారు.

 

 

Tags :