విభజన చట్టంలోని హామీలు అమలు : నరేంద్ర మోడీ
విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. విజయదశమి పర్వదినం రోజున, దేవీ నవరాత్రి ఉపవాసాలు పూర్తి చేసుకున్న శుభ తరుణాన ఆంధ్రప్రదేశ్ కొత్త చరిత్ర సృష్టించేందుకు శ్రీకారం చుట్టిందని అన్నారు. చంద్రబాబుతో కలిసి తాను ఇచ్చిన మాటను తూచ తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక మహత్తరమైన అడుగువేస్తోంది. చంద్రబాబు దేశవ్యాప్తంగా మట్టి, జలాలు సేకరంచిన విషయం తెలిసి నేను పార్లమెంటు నుంచి మట్టి, పవిత్రమైన యమునానది నుంచి నీటిని తీసుకుని వచ్చాను.
చంద్రబాబుకు అందించినప్పుడు నాకెంతో ఆనందం కలుగుతుందని ఉద్వేగంగా ఉన్నట్లు తెలిపారు. ఈ అమరావతి శతాబ్దాల సాంస్కృతి, చారిత్రక వైభవాన్ని మేళవించి సరికొత్త రంగు, రూపు, ఆధునికతను సంతరించుకొని నేటి అమరావతి ఆంద్రుల ఆశ, ఆపేక్షల కేంద్ర బిందువుగా మారబోతోంది. నిజమైన అర్థంతో చెప్పాలంటే ప్రజారాజాధానిగా అమరావతి రూపుదిద్దుకోబోతోంది. అందుకే నేడు ఇక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నా. ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ సమయంలో చంద్రబాబునాయడు ఎంతో వేగంగా ఈపని చేపట్టి ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలతో సమానంగా దీనిని తీర్చిదిద్దడానికి శ్రమించారు. ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లోని మంచి పద్దతులన్నింటినీ మేళవించి అమరావతి నిర్మాణాన్ని చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించారు. భారతదేశంలో కొత్త నరగాలను నిర్మించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశాన్నీ తు.చ. తప్పకుండా అమలు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేస్తామని సృష్టం చేశారు. కేంద్రం, రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తుందని, భుజం కలిపి నడుస్తుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత నిర్మితమౌతున్న తొలి రాజధాని నగరం అమరావతేనని అన్నారు. దేశంలో పట్టణీకరణవైపు శ్రద్ద తీసుకోనందువల్ల వ్వవస్థ అస్తవ్యస్ధంగా తయారైందని అన్నారు. పట్టణీకరణ సమస్యగా కాకుండా అవసరంగా గుర్తించి ముందుకు సాగాలన్నారు. అందుకే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. నాడు వాజ్‌పేయి హయాంలో ఎలాంటి విభేదాలు, విద్వేషాలు లేకుండా మూడు రాష్ట్రాలు ఏర్పడాయి. ఆంధ్రా, తెలంగాణ సైతం అలానే పనిచేస్తాయని, కలిసికట్టుగా పనిచేయాలని కోరుతున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాలకు కావాల్సిన సహాయ సహకారాలు కేంద్రం అందిస్తుందన్నారు.
అభివృద్ధి చెందుతున్న నగరాలకు అమరావతి సైతం ఓ దిక్సూచిగా ఉండాలని ఆశిస్తున్నాను. కొత్త రాజధాని నిర్మాణంలో చాలా సవాళ్లు ఎదురవుతాయని తెలిపారు. నాజీవితంలోసైతం పలు సవాళ్లు, అనుభవాలు ఎదురయ్యాయి. గుజరాత్‌లో భూ ప్రకంపనాలు వచ్చాయి. ఒక రాజకీయ దృడ సంకల్పం, ప్రజాబలం దేన్నయినా సాధించవచ్చునన్నారు. రాజకీయ కారణాలతో తొందరపాటుతో సరైన అవగాహన లేక రాష్ట్రాని విడగొట్టారు. ఈ సందర్భంగా చాలా మంది ప్రాణాలు కొల్పోయారు. ఆంధ్రా, తెలంగాణలోని తెలుగువారంతా ఒక్కటేనని తెలిపారు. తెలుగు ప్రజలు ఎప్పటి కలిసి ఉండాలని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాలు శక్తివంతంగా అభివృద్ధి చెందాలని ఆకాక్షించారు. ఆంధ్ర, తెలంగాణ అభివృద్దిలో పోటిపడితే దేశం శక్తివంతంగా తయారవుతుంది.