కరోనాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం- పిఎం వీడియో కాన్ఫరెన్స్ లో సిఎం జగన్
ఆంధప్రదేశ్‍లో కరోనా వైరస్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొని కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు. వైద్య పరంగా ఇప్పుడున్న యంత్రాంగాన్ని, పరికరాలను పూర్తి స్థాయిలో మోహరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వైరస్ నియంత్రణలో భాగంగా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి, లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, రైతులను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలను వైఎస్ జగన్ వివరించారు. విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతిల్లో 2,012 నాన్ ఐసీయూ బెడ్లు, 444 ఐసీయూ బెడ్లతో ప్రత్యేక కరోనా ఆస్పత్రులను నెలకొల్పామని, 13 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి ప్రత్యేకంగా ఆస్పత్రులను కేటాయించామన్నారు. వీటిల్లో 10,933 నాన్ ఐసీయూ బెడ్స్, 622 ఐసీయూ బెడ్స్ సిద్ధం చేశామని, మొత్తంగా 1,000 ఐసీయూ బెడ్లను సిద్ధం చేశాం. వీటికి తోడు ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఐసోలేషన్ కోసం మరో 20 వేల బెడ్లను సిద్ధంగా ఉంచామన్నారు.
ఫిబ్రవరి 10 నుంచి ఇప్పటి వరకు 27,876 మందికిపైగా విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. వీరిలో పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 10,540 మంది, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు 17,336 మంది ఉన్నారు. వీరిని తరచుగా కలుసుకున్నవారు, సన్నిహితంగా మెలిగిన వారు, వీరి కుటుంబ సభ్యులు.. మొత్తంగా ప్క్రెమరీ కాంటాక్టస్ 80,896 మంది ఉన్నారు. వీరందరూ పూర్తి పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించడానికి కుటుంబాల వారీగా సమగ్ర సర్వే చేశాం. గ్రామ, వార్డు వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‍ఎంల ద్వారా ఇప్పటికి రెండు మార్లు సర్వే చేశాం. ఢిల్లీ సదస్సుకు హాజరైన వారిని గుర్తించి క్వారంటైన్‍కు తరలించాం. వారితో కాంటాక్టులో ఉన్న వారిని గుర్తించడం, పరీక్షలు నిర్వహించండం, మంచి వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. లాక్‍డౌన్‍ను ద•ష్టిలో ఉంచుకుని పేద కుటుంబాలను ఆదుకోవడానికి పలు రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఏప్రిల్ నెలకు ఇవ్వాల్సిన రేషన్‍ను మార్చి 29 నుంచే ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. కేజీ కంది పప్పును ఉచితంగా ఇచ్చాం. ఒకే నెలలో మొత్తం 3 సార్లు రేషన్, కందిపప్పును ఉచితంగా అందిస్తున్నాం. నిత్యావసరాల కొనుగోలు కోసం ప్రతి పేద కుటుంబానికి రూ.1,000 ఈ నెల 4వ తేదీన ఇవ్వబోతున్నామని తెలిపారు.
మరిన్ని పరీక్షలు నిర్వహించడానికి టెస్టు కిట్లు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‍మెంట్ మరింత అవసరం ఉంది. ఆదాయం గణనీయంగా తగ్గడంతో పాటు కరవు నివారణ చర్యల కోసం అనుకోకుండా ఖర్చులు బాగా పెరిగాయి. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో ఇవ్వాల్సిన జీతాల్లో 50 శాతం వాయిదా వేశాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు.