శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలకు రండి
శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల కోసం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ దివ్య క్షేత్రం ముస్తాబైంది. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర ప్రముఖులు, విదేశాల నుంచి భక్తులు ఇతరులు పాల్గొంటున్నారు.
శ్రీరామానుజాచార్యుల సమతా విగ్రహం ఏర్పాటు కార్యక్రమాలు శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి సంకల్పంతో ముచ్చింతల్‌లో 2016లో ప్రారంభమయ్యాయి. 45 ఎకరాల విస్తీర్ణంలో రూ.1000 కోట్లతో పనులు జరిగాయి. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులను మేళవించి నిర్మాణాలు జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన 2700 మంది శిల్పులు పాల్గొన్నారు. ప్రధానంగా.. సమతామూర్తి 216 అడుగుల మహా పంచలోహ విగ్రహాన్ని చైనాలో తయారు చేయించారు. దీని బరువు 1800 కిలోలు. తొమ్మిది నెలల పాటు శ్రమించి..1600 భాగాలుగా విగ్రహాన్ని తయారు చేశారు. ఆ భాగాలను మనదేశానికి తీసుకొచ్చిన తర్వాత చైనాకు చెందిన 60 మంది నిపుణులొచ్చి విగ్రహ రూపునిచ్చారు. వాతావరణ మార్పులను తట్టుకొని వెయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
సమతామూర్తి విగ్రహం దిగువన భద్రవేదిక 54 అడుగులు, పద్మ పీఠం 27 అడుగులు, శ్రీరామానుజాచార్యుల విగ్రహం 108 అడుగులు, స్వామి చేతిలోని త్రిదండం 27 అడుగుల ఎత్తు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత ఎత్తయిన విగ్రహాల్లో ఈ సమతామూర్తి విగ్రహం రెండోది కావడం విశేషం. మహా విగ్రహం కింద విశాలంగా ఉన్న గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహ రూపంలో రామానుజులు నిత్యపూజామూర్తిగా కనిపిస్తారు. ఈ విగ్రహం చుట్టూ సప్తవర్ణ కాంతులు ప్రసరించే విధంగా ఏర్పాట్లు చేశారు. విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు వేదికను సిద్ధం చేశారు. ఈ గది ప్రధాన ద్వారంతో పాటు ఇతర ద్వారాలకు బంగారు రేకులను తొడిగారు.
5 వేల మంది రుత్వికులతో..
శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచి 5 వేల మంది రుత్వికులు వస్తున్నారు. 12 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 120 యాగశాలల్లో 1035 హోమగుండాలను సిద్ధం చేశారు. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో 144 యాగశాలలు నిర్మించారు. వీటిని పూర్తిగా తాటి కమ్మలు, వెదురు బొంగులతో ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు దఫాలుగా యాగాలు కొనసాగుతాయి. 144 యాగశాలలతోపాటు ప్రధాన యాగశాల నిర్మించారు. నాలుగు విదిక్కులలో 36 చొప్పున యాగశాలల సమూహం ఉంటుంది. మొత్తం యాగశాలల్లో 114 చోట్ల యాగాలు జరుగుతాయి. మిగిలినవి సంకల్ప మండపం, అంకురార్పణ మండపం, నిత్యపారాయణ మండపాలు, రెండు ఇష్టిశాలలు. వీటన్నింటిలో 1,035 హోమకుండాలు నిర్మిస్తున్నారు. ఉత్సవాలు జరిగే రోజులలో నిత్యం కోటిసార్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం జపించనున్నారు.
ప్రతి హోమకుండంలో ఒకపూటకు నాలుగు కిలోల నెయ్యి వినియోగిస్తారు. అలా రోజుకు ఒక్కో యాగశాలలో 9 హోమకుండాలకు 72 కిలోల నెయ్యి అవసరం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో దేశీయ ఆవు పాల నుంచి సేకరించిన 2 లక్షల కిలోల స్వచ్ఛమైన నెయ్యిని వినియోగించనున్నారు. హోమకుండలాల్లో వినియోగించేందుకు ఆవు పేడతో ప్రత్యేకంగా తయారు చేసిన పిడకలు వాడనున్నారు. ఇప్పటికే ఇదే ప్రాంగణంలో ప్రత్యేక యంత్రం సహాయంతో వీటిని తయారు చేసి రెడీ చేశారు.
శిల్పుల ప్రతిభను చాటేలా పరిసరాల నిర్మాణం
ఆనాటి కాలంలో దేవాలయాల నిర్మాణం, దాని ప్రాంగణం అంతా రాళ్ళతోనే నిర్మించారు. కొన్ని దశాబ్దాల తరువాత దేవాలయ నిర్మాణంలో రాతి శిల్పాలు, రాతి స్తంభాల నిర్మాణాలు పెద్దగా కనిపించలేదు. కాని ఇప్పుడు మళ్లీ యాదాద్రి, శ్రీరామానుజుల సహస్రాబ్ది ప్రాంగణంలో రాతి శిల్పాలు, రాతికట్టడాలు మనకు కనువిందు చేయనున్నాయి.శాతవాహనులు మొదలు కాకతీయులు, విజయనగర రాజుల వరకు నిర్మాణాలన్నీ రాతితోనే జరిపించారు. డంగు సున్నం మిశ్రమాన్ని నిర్మాణాలకు వినియోగించే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా రాతికి రాతికి మధ్య బైండిరగ్ వరకే దాన్ని వాడారు తప్ప ఆలయాల నిర్మాణానికి అంతగా వినియోగించలేదు. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని దక్కన్ సుల్తాన్‌ను ఓడిరచిన తర్వాత భారీ రాతి నిర్మాణాలు పెద్దగా జరగలేదు. సంస్థానాలు కొలువుదీరాక 17వ శతాబ్దంలో కొన్ని పెద్ద రాతి దేవాలయాలు రూపుదిద్దుకున్నాయి. జటప్రోలు సంస్థానాధీశులు స్థానికంగా మదనగోపాలస్వామి దేవాలయం, కృష్ణా తీరంలోని మంచాలకట్ట మాధవస్వామి దేవాలయాలు నిర్మించారు.
మళ్లీ 3 శతాబ్దాల తర్వాత 1910లో వనపర్తి సంస్థానాధీశులు పెబ్బేరు సమీపంలోని శ్రీరంగాపురంలో రంగన్యాథ స్వామి ఆలయాన్ని రాతితో నిర్మించారు. కానీ అది చిన్నగా ఉండే ఒకే దేవాలయం. జటప్రోలు దేవాలయాల తర్వాత ఇంత కాలానికి అత్యంత భారీగా, పూర్తి రాతితో నిర్మించిన దేవాలయం యాదాద్రి. రామానుజుల సహస్రాబ్ధి మందిరాలు మాత్రమే. కొంతభాగం సిమెంటు నిర్మాణాలు పోను ప్రధాన మందిరాలను రాతితోనే నిర్మించారు. నగరం నడిబొడ్డున నౌబత్ పహాడ్‌పై పాలరాతితో నిర్మించిన బిర్లామందిరం కూడా రాతి కట్టడమే అయినా అది మన సంప్రదాయ శైలికి భిన్నమైంది. ప్రస్తుతం ఆలయాల్లోని మూలవిరాట్టు మినహా మిగతా భాగాలను రాతితో పని అవసరం లేకుండా నిర్మిస్తున్నారు. అదే నాటి శిల్పకళా నైపుణ్యం ఇప్పుటివారిలో ఉందా అన్న సంశయాన్ని ఈ నిర్మాణాలు పోగొట్టాయి. తాము నాటి శిల్పులకు వారసులేమని ఈ రామానుజ సహస్రాబ్ది ఏర్పాటులో పాల్గొన్న శిల్పులు నిరూపించారు. యాదాద్రి, రామాను జుల సహస్రాబ్ది మందిరాల్లో దాదాపు 5 వేల మంది శిల్పులు అద్భుత పనితనాన్ని చూపారు.
120 కిలోల బంగారంతో రామానుజ విగ్రహం
శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో మరో ఆకర్షణీయమైన ఘట్టం శ్రీరామానుజులవారి బంగారు విగ్రహం ఏర్పాటు. ఆయన జీవితకాలం 120 సంవత్సరాలు అని చెబుతున్న కారణంగా ఈ బంగారు విగ్రహాన్ని 120 కిలోల బంగారంతో తయారు చేశారు. అతి పెద్దదైన సమతామూర్తి విగ్రహం కింద ఉన్న గర్భగుడిలో 120 కిలోల బంగారంతో ‘నిత్యపూజా మూర్తి’ శ్రీ రామానుజులవారు కొలువుదీరనున్నారు. ఈ విగ్రహానికి ప్రతిష్ట చేసి నిత్య పూజా కార్యక్రమాలను చేయనున్నారు.
9 అంకెకు ప్రాధాన్యం
శ్రీ రామానుజ సహస్రాబ్ది ప్రాజెక్టులో 9 అంకెకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. అతి పెద్ద రామానుజులవారి సమతామూర్తి విగ్రహం ఎత్తు 216 అడుగులు. మొత్తం కూడితే 9 వస్తుంది. ఆయన కూర్చున్న పద్మ పీఠం 27 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ రెండు కలిపితే 9 వస్తుంది. అలాగే రామానుజులవారి చేతిలోని త్రిదండం పొడవు 144 అడుగులు వీటన్నింటిని కలిపితే 9 అంకె వచ్చేలా దీనిని తయారు చేశారు. శ్రీ శఠారి 18 అడుగులు... దీనిని కలిపితే 9 వస్తుంది. పద్మపీఠంలోని ఏనుగుల సంఖ్య 36 ఇలా 9 అంకె వచ్చేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఇక్కడి యజ్ఞశాలలో 1035 యాగకుండాలు ఏర్పాటుచేశారు వీటన్నింటిని కలిపితే 9 వస్తుంది. ఇలా ప్రతి విషయంకూడా 9తో ముడిపడి మనకు కనిపిస్తాయి.
108 దివ్యదేశాల ఆలయాలు
శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల ఎత్తైన రామానుజల మహా విగ్రహం చుట్టూ 108 దివ్యదేశ మందిరాల ప్రతిష్ఠ, కుంభాభిషేకం కార్యక్రమాలను చేయనున్నారు. భగవంతుడిని సేవించడానికి వీలుగా 12 మంది ఆళ్వారులు తమ పాశురాలతో స్వామిని సేవించి తరించారు. వారు పాడిన పాశురాలనే దివ్య ప్రబంధంగా పేర్కొంటారు. ఈ దివ్య ప్రబంధాన్ని వైష్ణవ దేవాలయాల్లో అనునిత్యం పఠిస్తుంటారు. ఈ ఆళ్వారులు వివిధ చోట్ల పర్యటించి అక్కడి భక్తులకు తమ పాశురాల ద్వారా ఆయా దేవాలయాల విశిష్టతను, పవిత్రతను తెలియ జేశారు. వారు పర్యటించిన ప్రదేశాలనే దివ్యదేశాలుగా చెబుతారు. అలాంటి దివ్యదేశాలు 108 ఉన్నాయి. 106 క్షేత్రాలను దర్శించి ఆళ్వారులు ఆరాధించిన నారాయణ మూర్తులను సేవించినవారికి మిగిలిన రెండు పరంధామాలను చేరడం సులువనీ అదే ముక్తిమార్గమనీ చెప్పారు రామానుజులు. అందుకే వైష్ణవ క్షేత్రాలలో ఆళ్వారుల విగ్రహాలనూ రామానుజుని విగ్రహాన్నీ ఏర్పాటుచేయడం కనిపిస్తుంది. రామానుజుని సమతా విగ్రహం చుట్టూ ఈ 108 దివ్యదేశాల ప్రతిరూపాలనూ నిర్మించారు. శ్రీరంగం, తిరుమల, కంచి, అహోబిలం, భద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, కుంభకోణం.. ఇలా మొత్తం 108 ప్రధాన వైష్ణవ గర్భాలయాల ఆకృతిలో ఆలయాలు, దేవతామూర్తులు ఇక్కడ చూసి తరించవచ్చు. అన్ని దివ్యదేశాలను సందర్శించే అవకాశం అందరికీ కలగకపోవచ్చు. అలాంటివారు ఇక్కడ ఉన్న 108 దివ్యదేశ మూర్తు లను చూడటం ద్వారా తమ కోరికను తీర్చుకో వచ్చుననే ఉద్దేశ్యంతో ఇక్కడ ఏర్పాటు చేశారు.
ప్రధానాకర్షణ ఫౌంటెయిన్!
శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల ఎత్తైన రామానుజల మహా విగ్రహం దగ్గర అష్టదళ పద్మాకృతిలో ఉండే 45 అడుగుల ఎత్తుతో కూడిన ఫౌంటెయిన్ కనిపిస్తుంది. పద్మ పత్రాలు విచ్చుకునేలా దాదాపు రూ.25 కోట్లతో ఫౌంటెయిన్‌ను నిర్మించారు. పద్మపత్రాల మధ్య నుంచి నీళ్లు, రామానుజులను అభిషేకిస్తున్న భావన భక్తులకు కలుగుతుంది. అదే సమయంలో రామనుజుల కీర్తనలను శ్రావ్యంగా వినిపిస్తాయి. సూర్యాస్తమయం తరువాత రామానుజులు ప్రభోధించిన సమానత్వ ఘట్టాలను మ్యూజిక్‌తో త్రీడీ షో ద్వారా ప్రదర్శించనున్నారు.
రాతితో ఏర్పాటైన భద్రపీఠం...
రామానుజుల 216 అడుగుల ఎత్తున్న విగ్రహం దిగువన ఉన్న 54 అడుగుల ఎత్తున్న భద్రపీఠానికి రాజస్తాన్‌లోని బన్సీపహాడ్‌పూర్ ప్రాంతం లోని లేత గులాబీ రంగు ఇసుక రాయిని వాడారు. మౌంట్‌అబూ ప్రాంతంలోని శిల్పుల చేత దాన్ని చెక్కించి తీసుకొచ్చి ఇక్కడ వినియోగించారు. సమతామూర్తి చుట్టూ విస్తరించి ఉన్న 108 దివ్యదేశ మందిరాల్లోని గర్భాలయ అంతరాలయాలకు ఏపీలోని కోటప్పకొండ, మార్టూరు పరిసరాల్లోని బ్లాక్ పెరల్ గ్రానైట్‌ను వాడారు. దివ్య మండపంలో హోయసల, కాకతీయ శైలిలో ఏర్పాటు చేసిన 468 స్తంభాలకు రాజస్తాన్‌లోని బేస్‌లానా బ్లాక్ మార్బుల్ (నల్ల చలువరాయి) వినియోగించారు. కాంచీపురం సమీపంలోని వాలాజా ప్రాంతంలోని కృష్ణ పురుష శిలను ఆలయాల్లోని ప్రధాన మూర్తులకు వాడారు.
రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు... తెలంగాణకే గర్వకారణం
శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఏర్పాటు చేసిన అతి పెద్ద రామానుజ విగ్రహం, రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు తెలంగాణకే తలమానికంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ సహస్రాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై శ్రీరామనగరంలోని జీయర్‌స్వామి ఆశ్రమాన్ని ఆయన ఇటీవల సందర్శించి జీయర్ స్వామితో కలిసి రామానుజ విగ్రహ వేదికను, రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న యాగశాలకు వెళ్లి పనులను పరిశీలించారు. యాగశాల, సమతాస్ఫూర్తి కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన తరువాత ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు పలు సూచనలు ఇవ్వడంతోపాటు మిషన్ భగీరథ నీటి సరఫరా అయ్యేలా చూడాలని ఆదేశించారు. అలాగే విద్యుత్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. యాగం సమయంలో నిరంతరాయంగా పవర్ సప్లై చేయాలని ఆదేశించారు. యాగానికి సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని చెప్పారు. యాగశాల వద్ద ఫైర్ ఇంజన్లు ఏర్పాటు, యాగానికి వచ్చే వీఐపీల కోసం వసతి, రోడ్డు సౌకర్యం వంటి అంశాలపై సూచనలు చేశారు. ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంతోపాటు ఈ ఉత్సవాలకు వస్తున్నవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు.
ఈ వేడుకల్లో పాల్గొనడం మా అదృష్టం - మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వరరావు
శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఏర్పాటు చేసిన అతి పెద్ద రామానుజ విగ్రహం, రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం తమ అదృష్టమని మై హోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వరరావు అన్నారు. ముచ్చింతల్ వద్ద 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహ ఆవిష్కరణతోపాటు శ్రీ చినజీయర్ స్వామి చేతుల మీదుగా జరిగే రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు, లోకకళ్యాణార్థం నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువులో పాల్గొనడం తాము చేసుకున్న పుణ్యఫలమని అంటూ ఇలాంటి భక్తికార్యక్రమాల నిర్వహణలో తమవంతుగా తోడ్పాటును అందిస్తున్నామని రామేశ్వరరావు చెప్పారు. అందరూ ఈ వేడుకల్లో పాల్గొని రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
వేర్వేరు రోజుల్లో రాష్ట్రపతి, ప్రధాని
ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతలకు విచ్చేస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు సమతామూర్తి మహా విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు. 13వ తేదీన రాష్ట్రపతి కోవింద్ వస్తారు. ప్రధానాలయంలోని నిత్య పూజామూర్తి బంగారు విగ్రహానికి తొలి పూజ చేయడం ద్వారా ఆవిష్కరిస్తారు. ఈ వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరుండి పర్యవేక్షించనున్నారు.