ఆటా మహాసభలకు వస్తున్న రాజకీయ నాయకులు
అమెరికా తెలుగు సంఘం నిర్వహిస్తున్న సిల్వర్ జూబ్లి వేడుకలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఇతర ప్రతినిధులు హాజరవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈ మహాసభలకు రావచ్చని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఆయన ఇప్పటికే తమ ఆహ్వానాన్ని మన్నించారని వారు చెప్పారు. కేంద్రమంత్రులు ముప్పవరపు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్ కూడా వస్తున్నారని సమాచారం. తెలంగాణ నుంచి డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, పి. మహేందర్ రెడ్డి, ఎ. ఇంద్రకరణ్ రెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వస్తున్నట్లు సమాచారం. ఎంపిలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, వై.వి. సుబ్బారెడ్డి, పి. మిథున్ రెడ్డి, సిఎం. రమేష్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులను కూడా మహాసభలకు ఆహ్వానించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఈ మహాసభలకు వస్తున్నట్లు తెలిసింది.