రాష్ట్రపతి భవన్‍లో ట్రంప్ దంపతులకు విందు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్‍నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‍లో ప్రత్యేక విందు సమావేశం ఏర్పాటు చేశారు. విందుకు హాజరైన ట్రంప్ దంతులను కోవింద్, ఆయన భార్య సవిత కోవింద్ ఆహ్వానం పలికారు. రాష్ట్రపతి భవన్‍లో దర్బార్ హాలులోకి ట్రంప్ దంపతుల్ని తీసుకువెళ్లి అంతా చూపించారు. ఆ హాలులో 5వ శతాబ్దం నాటి గౌతమ బుద్ధుడి విగ్రహం, భారతీయ నాయకుల చిత్రపటాలు ఉన్నాయి. ఆ తర్వాత ట్రంప్, కోవింద్ కాసేపు మాట్లాడుకున్నారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయని, ఇందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ట్రంప్‍కి ఘనస్వాగతం పలకడమే నిదర్శనమని అన్నారు. అమెరికా తమకు అత్యంత విలువైన మిత్ర దేశమని, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి భారత్ కట్టుబడి ఉందని అన్నారు.
ఈ రెండు రోజులు అద్భుతంగా గడిచాయని, ఎంతో ప్రయోజనకరమైన చర్చలు జరిగాయని ట్రంప్ తెలిపారు. వాణిజ్య, రక్షణ ఒప్పందాల్లో ముందడుగులు పడ్డాయని చెప్పారు. భారత్‍కు రావడం వల్ల ఎంతో నేర్చుకున్నామని, ఎన్నో అందమైన అనుభూతులతో తిరిగి వెళుతున్నామని ట్రంప్ చెప్పారు. రాష్ట్రపతి కోవింద్ చేసిన అతిథి మర్యాదలకు ఆయనకు, ఆయన అనుచర వర్గానికి ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ విందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులతో పాటు నలుగురు ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‍రావు (తెలంగాణ), బీఎస్ యడియూరప్ప(కర్ణాటక), మనోహర్‍లాల్ ఖట్టర్ (హరియాణా), శర్బానంద సోనోవాల్ (అస్సాం).. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‍ఏ బాబ్డే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‍జీ, బ్యాంకర్ ఉదయ్ కొటక్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడి రాకను పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‍ను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. విందు అనంతరం ట్రంప్ తిరుగు పయనమయ్యారు.