సమతామూర్తి స్వర్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
ముచ్చింతల్ ప్రపంచ వ్యాప్తంగా మరో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా దివ్యక్షేత్రంలోని 120 కిలోల బంగారంతో తయారు చేసిన భగవద్రామానుజాచార్యుల సువర్ణమూర్తిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. స్వర్ణమూర్తికి రాష్ట్రపతి, ఆయన సతీమణి సవితా కోవింద్ ప్రత్యేక తొలిపూజలు నిర్వహించి లోకార్పణ చేశారు. ఈ క్రమంలో త్రిదండి చిన జీయర్ స్వామిజి రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు 120 కేజీల సువర్ణమూర్తి విశిష్టతలను వివరించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామిజీ బంగారు శఠగోపంతో రాష్ట్రపతి కుటుంబసభ్యులను ఆశీర్వదించారు. కాగా శ్రీరామనగరం చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిన జీయర్ స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వర రావు స్వాగతం పలికారు.
సమతా క్షేత్రంలో రాష్ట్రపతికి పూర్ణకుంభంతో వేదపండితులు స్వాగతం పలికారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌జీ కుటుంబ సభ్యులతో కలిసి 216 అడుగలు రామానుజాచార్యుల విగ్రహంతో పాటు సమాతాక్షేత్రంలోని 108 దివ్యదేశాలను సందర్శించారు. చిన జీయర్‌స్వామీజీ దివ్యక్షేత్రాల విశిష్ఠతలను, సమతా క్షేత్ర స్ఫూర్తి కేంద్రం విశేషాలను రాష్ట్రపతి కుటుంబానికి వివరించారు. అనంతరం రాష్ట్రపతి దంపతుకలు ప్రతిమను వారు బహుకరించి సత్కరించారు.